Aug 30,2023 23:14

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మీ


ప్రజాశక్తి బాపట్ల
ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి కోరారు. ఆశవర్కర్ల యూనియన్‌ బాపట్ల జిల్లా కమిటి సమావేశం జిల్లా ఉపాధ్యక్షరాలు కె.జాన్సీ అధ్యక్షతన బాపట్ల జిల్లా సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగింది. సమావేశంలో ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లకు తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్‌ఎంలు చేయాల్సిన సర్వేలు వారితోనే చేయిస్తూ వారిపై మరింత పరిహరం మోపుతున్నారని తెలిపారు. పనిచేయని ఫోన్లు ఇచ్చి ప్రతిరోజు ఆశా ఈ యాప్‌లో ఉదయం 9.00గంటల లోపు లాగిన్‌ అవ్వాలి లేకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదన్నారు. పెరుగుతున్న ధరల్లో భాగంగా ఆశావర్కర్ల వేతనాలు పెంపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మణిలాల్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మజుందార్‌, యూనియన్‌ నాయకులు ఆశాజ్యోతి, శివకుమారి, శాంతకుమారి, జ్యోతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.