Jun 26,2023 02:14
సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు మణిలాల్‌

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణంలో ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఆశవర్కర్స్‌ స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ డిమాండ్‌ చేశారు. రేపల్లె స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆశా వర్కర్‌ యూనియన్‌ సమావేశం యూనియన్‌ అధ్యక్షురాలు డి బుజ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు, మరియు ఆశ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ పట్టణంలో పెరిగిన జనాభా ప్రకారం ఆశా వర్కర్స్‌ను పెంచాలని, ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ప్రతిరోజూ ఆశా వర్కర్‌ జనరల్‌ ఓపి ఐదుగురిని తీసుకురావాల్సిందే అనే నిబంధన వల్ల ఆశవర్కర్స్‌ గర్భిణులకు అందించే సేవలు, మరియు ఆశ వర్కర్‌ నిర్వహించాల్సిన సేవలకు ఆటంకం ఏర్పడుతోందని, కావున ఆశ వర్కర్స్‌తో సంబంధం లేని పనులు చేయంచరాదని, ఓల్డ్‌ టౌన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో వస్తున్న స్థానిక సమస్యలను పరిష్కరించి పని ఒత్తిడి తగ్గించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరైన శెలవులు లేకపోవటంతో ఆశ వర్కర్స్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రేపల్లె పట్టణం పరిధిలో ఆశా వర్కర్స్‌ పావని, బుజ్జి, ఎస్తేర్‌రాణి, మహాలక్ష్మి, జ్యోతి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.