Oct 07,2023 23:36

ప్రజాశక్తి-కాకినాడ
గుంటూరు జిల్లా తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో శుక్రవారం అపస్మారక స్థితికి చేరుకుని విధి నిర్వహణలో చనిపోయిన ఆశ వర్కర్‌ రేపూరి కపమ్మ ప్రభుత్వ హత్యేనని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి విమర్శించారు. చనిపోయిన ఆశ వర్కర్‌ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, మరణానికి కారణమైన మెడికల్‌ ఆఫీసర్‌, హెల్త్‌ విజిటర్‌ పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, ఆశ వర్కర్ల పై పనిభారం తగ్గించి ఆన్‌ లైన్‌ వర్కు రద్దు చేయాలని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ, నగర కార్యదర్శి భారతి, పద్మావతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ చనిపోయిన ఆశా వర్కర్‌ 37 సంవత్సరాల వయస్సు మాత్రమేనని, ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఇటీవలే మంచాన పడి, కుటుంబానికి ఆమెపై ఆధారపడిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆశా వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వత్తిడి తెస్తు ఎటువంటి సెలవలు ఇవ్వటంలేదని, మెటర్నీటీ సెలవలుకూడా ఇవ్వటంలేదన్నారు. గతంలో కోవిడ్‌కాలం నుంచి ఆశా వర్కర్లు మరణిస్తున్నారని ఇటీవలే వత్తిడికి తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఆశా వర్కర్‌ జానకి మరణించిందన్నారు. ఆశా వర్కర్లు వారికి కేటాయించిన కుటుంబాలలోనే పనిచేయాల్సి వున్నాకూడా జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పేరిట ఇతర ప్రాంతాలలో వీరు పనిచేయాలని అధికారులు తీవ్ర వత్తిడి తీసుకోచ్చారన్నారు. పత్తిపాడు పిహెచ్‌సి పరిధిలో నిన్ననే ఇద్దరు ఆశా వర్కర్లకు మెమోలు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అధికారుల వత్తిడివలన ఆశా వర్కర్లు అనారోగ్యపాలవుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కనీస గుర్తింపుకుడా ఇవ్వడంలేదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెక్కల వేణి, మలకా నాగలక్ష్మి, గుదరిగుంట లక్ష్మీ, అరుణ, మేరీ, ఉమా, రోషిణి, కపవతి, ధనకుమారి, భవాని, సత్యవేణి, సత్యవతి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.
కపమ్మ కుటుంబానికి ఆదుకోవాలని ఆశాల డిమాండ్‌
గండేపల్లి పని ఒత్తిడికి గురై జగనన్న సురక్షా క్యాంపులోనే కుప్పకూలి చనిపోయిన ఆశావర్కర్‌ రేపూడి కపమ్మ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ గండేపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద మండల ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆశ లలిత, మాట్లాడుతూ మరణానికి కారణమైన మెడికల్‌ ఆఫీసర్‌, హెల్త్‌ విజిటర్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు పెద్దాపురం మృతురాలు ఆశ వర్కర్‌ కపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం పెద్దాపురం ఆసుపత్రి, కాండ్రకోట, పులిమేరు పిహెచ్‌సిల వద్ద ధర్నాలు చేశారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు లోవ కుమారి, వరలక్ష్మి, రత్నం, సిఐటియు నాయకులు క్రాంతి కుమార్‌, శ్రీనివాస్‌, బేబీ, నాగు, పద్మ, చంటి, వెంకటలక్ష్మి, సత్యవేణి, సలోమని, వరలక్ష్మి, జలమని, లావణ్య, సరళ, లక్ష్మీ, రత్నం, రవణమ్మ, వీర మహాలక్ష్మి, చంటమ్మ, గౌరీ, ప్రవీణ కుమారి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు: మృతురాలు ఆశ వర్కర్‌ కపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని తాళ్ళరేవు లో ఆశ వర్కర్లు ధర్నా చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగలక్ష్మి, అనంతలక్ష్మి, మని,పుష్పావతి,కళా వతి,శారద దేవి, తదితరులు పాల్గొన్నారు.