Nov 21,2023 22:59

ప్రజాశక్తి - దేవరపల్లి విధి నిర్వాహణలో మృతి చెందిన ఆశా వర్కర్‌ శిలబోయిన రమాదేవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఆశా వర్కర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని ఆశ వర్కర్లు మంగళవారం నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి దిగారు. ఈ సందర్భంగా స్థానిక పిహెచ్‌సి వద్ద రిలే నిరహార దీక్ష శిబిరాన్ని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పోచమ్మ ప్రారంభించారు. ఈ సందర్భగా పోచమ్మ మాట్లాడుతూ మండలంలోని కృష్ణంపాలెం గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ శిలబోయిన రమాదేవి విధి నిర్వాహణలో ఉండగా మృతి చెందిందని తెలిపారు. ఆమె మృతి చెంది 13 నెలలు గడుస్తున్నా నేటికీ ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికే అనేక దఫాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగానే మంగళవారం నుంచి నిరవధిక దీక్షకు దిగామన్నారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకుంటే జిల్లావ్యాప్తంగా ఆశ వర్కర్లు సమ్మెలోకి దిగుతారని ఆమె హెచ్చరించారు. యూనియన్‌ మండల నాయకురాలు మల్లెపూడి వెంకటలక్ష్మి మాట్లాడుతూ చనిపోయిన ఆశ వర్కర్‌ కుటుంబానికి న్యాయం చేయకుండా దొడ్డిదారిన వేరొకరికి ఆ పోస్టును కేటాయించడం దారుణమన్నారు. అర్హత లేని వారికి ఆ పోస్టును కేటాయించారని దుయ్యబట్టారు. రమాదేవి కుటుంబానికి న్యాయం చేసే వరకు సమ్మెలో కొనసాగుతామని తెలిపారు. ఆశ వర్కర్లు చేపట్టిన ఆందోళనకు సిపిఎం సీనియర్‌ నాయకులు కృష్ణారావు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌భగత్‌, మండల నాయకులు కేె.రత్నాజీ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు జి.బేబీకుమారి, టివి.రామతులసి, కె.సత్యవేణి, అయినపర్తి మేరీ పాల్గొన్నారు.