Oct 07,2023 20:22

ప్రజాశక్తి - భీమవరం
ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కారణంగా ప్రాణాలుకోల్పోయిన ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. శనివారం భీమవరంలో తాలూకా సెంటర్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా నాయకులు ఎస్‌.లారెన్స్‌ కుమారి మాట్లాడారు. ఆరోగ్య సురక్ష పేరుతో ఆశా కార్యకర్తలను ఇష్టానుసారం ఒత్తిడికి గురిచేయడం వల్లే వారు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా ఒత్తిడికి గురిచేస్తూ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, రాజేశ్వరి, కుమారి, అన్నపూర్ణ, వరలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
పెనుమంట్ర : తాడేపల్లిలో ప్రభుత్వ ఒత్తిళ్లతో మృతి చెందిన ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు, ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగుబాటి జ్యోతి డిమాండ్‌ చేశారు. శనివారం మార్టేరు పిహెచ్‌సి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలిపి డాక్టర్‌ ఎస్‌కె.సవీద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ సురక్ష కార్యక్రమం పేరుతో ఆశా వర్కర్లకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారన్నారు. చనిపోయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి కోరారు. ఈ కార్యక్రమంలో వి.లక్ష్మి, డి.లావణ్య, జె.శాంతి, డి.కుమారి, జై.వరలక్ష్మి పాల్గొన్నారు.
పెనుగొండ : చనిపోయిన ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిఐటియు మండల అధ్యక్షుడు గంగారావు డిమాండ్‌ చేశారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన ఆశా, సిఐటియు నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్ధాంతం పిహెచ్‌సి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, కడలి త్రినాథ్‌, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
యలమంచిలి : ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ దొడ్డిపట్ల, మేడపాడు, యలమంచిలి పిహెచ్‌సిల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు మండల అధ్యక్షులు కె.శ్రీవర్ధిని, కార్యదర్శి దేవ సుధాకర్‌, కార్యకర్తలు రమణ, సునీత, రాజేశ్వరి, శారద, నర్సమ్మ, సూర్యావతి, మహాలక్ష్మి, సుజాత పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని లంకలకోడేరు పిహెచ్‌ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ లక్ష్మి, శిరోమణి, కృపమేరి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.