Aug 23,2022 23:45

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌

ప్రజాశక్తి-కంచరపాలెం : ఆరోగ్య రంగంలో విశేష సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ డిమాండ్‌ చేశారు. కంచరపాలెంలో బిఎన్‌ఆర్‌ భవనంలో ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా కమిటీ విస్తృత సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆశా కార్యకర్తలు పనిచేశారన్నారు. అటువంటి వారిపై నేడు వేధింపులు, పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు. ఉద్యోగ భద్రత లేదన్నారు. ప్రభుత్వం తరుపున ఏవిధమైన కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటి కనుగుణంగా కనీస వేతనం పెరగడం లేదని పేర్కొన్నారు. ఆశా వర్కర్లందరికీ కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. వీటి సాధన కోసం ఆశా వర్కర్లందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం సెప్టెంబర్‌ 20వ తేదీన కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి.మణి, ఎస్‌.పద్మ, మేరీ, సీత పాల్గొన్నారు.