
ప్రజాశక్తి-రాంబిల్లి
ఆశా కార్యకర్తలను సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడునాయుడు డిమాండ్ చేశారు. మండలంలో రాంబిల్లి, దిమిలి పీహెచ్సీలలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను మంగళవారం కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతం కంటే పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని, నాసిరకమైన ఫోన్లతో అనేక పనులు చేయమంటున్నారని, ఆ ఫోన్లు పనిచేయడం లేదని, సాంకేతిక లోపాలుంటే తమపై ప్రతి ఒక్కరు కోప్పడుతున్నారని ఆశా కార్యకర్తలు తమ గోడు వెల్లబుచ్చారు. సచివాలయ సిబ్బందితోపాటు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది కూడా తమపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10వేలు జీతం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నిటినో నిలిపివేసిందని, ఇలా అయితే మేము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దేముడునాయుడు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, నాణ్యమైన సెల్ ఫోన్లు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారి సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు, పి మంగ, ఎం నూకరత్నం, ఆర్ తలుపులమ్మ, వెంకటలక్ష్మి, రామలక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.