Oct 07,2023 20:52

లంకాపట్నం యుపిహెచ్‌సి వద్ద నిరసన తెలుపుతున్న ఆశావర్కర్లు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరణించిన ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించాలని, ఆశా వర్కర్లందరికీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనలు చేపట్టారు. విజయనగరం రూరల్‌ గుంకలాం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వద్ద ఆశా వర్కర్లు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసి విధులకు హాజరయ్యారు. విజయనగరం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ లంకా పట్నం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సిఐటియు నగర అధ్యక్షులు ఎ. జగన్మోహన్‌రావువు మాట్లాడుతూ ఆశా వర్కర్‌ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరణిస్తే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మిని అర్ధరాత్రి అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తీవ్ర పని ఒత్తిడితో ఆశ వర్కర్ల గుండెలు పగిలిపోతున్నాయని, పిట్టల్లా రాలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల అందరికీ 10 లక్షలు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కపమ్మకు రూ.50 లక్షలు చెల్లించేంతవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ఈశ్వరమ్మ, మహాలక్ష్మి, పైడితల్లి, గౌస్య, తదితరులు పాల్గొన్నారు.