Sep 17,2023 21:24

మాట్లాడుతున్న ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి

ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులు సరికావు : సిఐటియు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు

ఆశ వర్కర్లపై రాజకీయ అధికారుల వేధింపులు సహించేది లేదని సిఐటియు డివిజనల్‌ బి రాముడు, ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు బి శివలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్లో ఆశా వర్కర్ల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సేవలందిస్తున్నారని, ఆశ వర్కర్లకు రాజకీయ, అధికారుల వేధింపులు నానాటికి పెరుగుతున్నాయన్నారు. సబ్‌ సెంటర్‌లో నుండి పీహెచ్సీల వరకు అధికారులు సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పై ఉద్యోగులు చేసే పనుల్లోనూ ఆశ వర్కర్‌తో చేయడానికి ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని పనులు చేయించడం, రూములు క్లీన్‌ చేయాలని, వాటర్‌ తీసుకురావాలని జాబ్‌ చార్ట్‌కు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల 15 రోజుల వేతనం కోతపెట్టారని ఆశ వర్కర్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోగా పని భారం పెంచారన్నారు. ప్రభుత్వ వ్యవహా రాల తీరు మారకపోతే డిమాండ్ల సాధనకు ఆశ వర్కర్లు పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రంగలక్ష్మి, సుమలత, నరసమ్మ, లక్ష్మీదేవి, షబానా, నాగవేణి, లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.