
ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడి పెంచి ఆశ వర్కర్ కృపమ్మ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆశ వర్కర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఒ మంగళవారం ప్రకాష్‌నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌కు వచ్చారు. ఆశ వర్కర్లలో గంటన్నర పాటు చర్చించి వారి డిమాండ్ మేరకు హెచ్‌యును సీతానగరం పిహెచ్‌సికి బదిలీ చేశారు. విచారణలో నలుగురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ డిఎంహెచ్‌ఒ రత్నమనోహర్ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు ఇక నుంచి అధికారుల నుంచి వేధింపులు ఉండవని చెప్పారు. తాము చేస్తున్న డిమాండ్ అధికారులు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడంతో బుధవారం నుంచి విధులకు హాజరవుతామని ఆశాలు ప్రకటించారు. తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో జరుగుతున్న ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా ప్రకాష్‌నగర్ సిఐటియు కార్యాలయంలో ప్రకాష్‌నగర్ పరిధిలోని యుపిహెచ్‌సి ఆశ వర్కర్లలో సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఐక్యంగా పోరాట స్ఫూర్తి కనబరచిన ఆశాలకు అభినందనలు తెలిపారు. సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, కె.లక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్ల పోరాటానికి మద్దతు తెలిపిన టిఎన్‌టియుసి, టిడిపి, ఎఐటియుసి, సిపిఎం, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటానికి మద్దతు తెలిపిన భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ వర్కర్స్ సంఘం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రకాష్‌నగర్ యుపిహెచ్‌సి పరిధిలో అధ్యక్షులుగా ఎస్.విజయలక్ష్మి, కార్యదర్శిగా వేముల రేణుకతో పాటు మరో ఆరుగురితో కమిటీ ఎన్నికైంది.