ప్రజాశక్తి-విజయవాడ: ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న మంగళవారం ధర్నా చౌక్‌లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలోని ఆశ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల కోరారు. విజయవాడ సింగనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ధర్నాను విఫలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుటిలయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినా ధర్నా జరిగి తీరుతుందని పేర్కొన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆశ వర్కర్లు పలు మార్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి, పరిష్కరించడానికి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె.దుర్గారావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు దుర్గాలక్ష్మి, మాధవి, శోభ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.










