Oct 10,2023 23:44

ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు, నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి: వివిధ రకాల యాప్‌లతో పని ఒత్తిడి పెంచి ఆశ వర్కర్‌ కృపమ్మ మృతికి కారణమైన మెడికల్‌ అధికారి మానసమంజరి, హెచ్‌యు రమాదేవిపై చర్యలు తీసుకోవాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకుంటేనే ఆశ వర్కర్ల మనోధైర్యం పెరిగి పని చేయడానికి వీలుంటుందన్నారు. ఈ మేరకు తాడేపల్లి తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో మంగళశారం ధర్నా చేపట్టారు. ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలతో వారి నైపుణ్యానికి సంబంధించిన పనులు కాకుండా ఇతర పనులు చేయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం పండుగ రోజు, ఆదివారం కూడా సెలవులు ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. సమయపాలన లేకుండా గొడ్డుచాకిరీ చేస్తున్నా అరకొత వేతనం రూ.10 వేలు మాత్రమే దక్కుతోందరు. కృపమ్మ మృతితో ఆశాలు, ఎఎన్‌ఎంలు ప్రాణభయంతో ఉన్నారని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఆశాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు మద్దతుగా ఉపాధ్యాయులు, ఎఐటియుసి నాయకులు మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, తాడేపల్లి తహశీల్దార్‌ ఎం.నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, నాయకులు ఎ.శౌరిబర్తులం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.