రోజు రోజుకీ సూర్యుడు చిగురించినట్టు
ఆశ చిగురిస్తూనే వుంటుంది
తీరం మీద కూలిపోయే కెరటాలదేముంది
కడలి కడుపులో కలలు కలలుగా అలలు
చిగురించినట్టు
ఆశ చిగురిస్తూనే వుంటుంది
రాళ్ళకు కళ్ళిచ్చిందెవరు
కళ్ళకు చైతన్య స్వప్నాలిచ్చిందెవరు
దించిన శిరస్సుల మీద ఆకాశాలను నిలిపి
నిటారుగా నిలబెట్టి ముందుకు నడిపిందెవరు
నిస్పృహలోంచి నిస్సహాయతలోంచి
ఒంటరొంటరి కన్నీటి కల్లోలాలలోంచి
అగ్నిపర్వతాలను పుట్టించి చరిత్రను
ముద్దాడిందెవరు
కాలం కాగితం మీద
మట్టిపాదాల మహాప్రస్థానాన్ని
ముద్రించిందెవరు
ఈ చేతులకింత ధైర్యాన్ని
ఈ వేళ్ళకింత చురుకుదనాన్ని
ఈ కన్నులకింత తేటదనాన్ని
ఈ మాటలకింత గడుసుదనాన్ని
అద్దింది ఎవరు?
ప్రశ్నలకు ఆత్మల్ని గుచ్చి
చీకటి గోళాలను చీల్చిందెవరు?
నిజాన్ని నిలబెట్టడానికి
ఈ భుజాలకింత బలాన్నిచ్చిందెవరు
మతం కోరలు చాచినప్పుడు
కులం ప్రాణాలు కోరినప్పుడు
ఆధిపత్యమో అహంకారమో అధికారమో
అక్షరం గొంతు నులిమినప్పుడు
స్వేచ్ఛకు సంకెళ్ళు వేసి రంకెవేసినప్పుడు
కత్తులు మొలిచిన దేహాలతో
తిరగబడ్డ తెగువకు ఊపిరి ఊదిందెవరు
ఆశ చిగురిస్తూనే వుంటుంది
తాష్కెంటులో చిగురించిన పార్టీలా
ఆశ చిగురిస్తూనే వుంటుంది
వందేళ్ళు కాదు
కాలం పొడవునా మనుషుల కళ్ళల్లో
కొత్త వెలుగుల పూలగుత్తుల్లా
ఆశ చిగురిస్తూనే వుంటుంది
వేలాడిన ఉరికొయ్యలు
పారాడిన చెరసాలలు
దిగబడ్డ తూటాలు
ఎగబడ్డ వ్యాఘ్రాలు
అరికాలిలో మృత్యువు..
అణువణువూ కేరింతల కమ్యునిజం శిశువు-
ఎన్ని త్యాగాలు..
ఎన్ని రక్తపాతాలు..
చీలిపోయిన దారులు కాదు
ఆశయం తలెత్తి నడిపిన పోరులు
చిగురించినట్టు
ఆశ చిగురిస్తూనే వుంటుంది
విరామం విరమణ కాదు
అపజయం మరణమూ కాదు
విప్లవం ఎప్పుడూ ఎర్రగానే వుండదు
పూచిన ప్రతి కొత్త రంగులోనూ
మానవ మేనిఫెస్టో గుబాళిస్తూనే వుంటుంది
స్వార్థం క్రౌర్యమై..
క్రౌర్యం రాజ్యమై
ఒక దేశమే బందిఖానాగా
మారిపోయినప్పుడు
కంఠాల చుట్టూ చేతుల చుట్టూ
పాదాల చుట్టూ గుండెల చుట్టూ
ఇనప కంచెలు మొలిచినప్పుడు
రెపరెపల పిడికిలి పువ్వులా ఎర్రజెండా
మన వెన్నెముకల్లో
విచ్చుకుంటూనే వుంటుంది
ఆశ చిగురిస్తూనే వుంటుంది
(వందేళ్ళ కమ్యునిస్టు పార్టీకి వందనాలతో)
-ప్రసాదమూర్తి
8499866699