
ఆలోచనాపరులనూ సామాజిక పరిశోధకులనూ ఇప్పటికీ ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది: 'ఉత్తమ స్థాయి తత్వవేత్తలకూ మత సంస్కర్తలకూ శాస్త్రవేత్తలకూ కష్టించి పనిచేసే స్వభావం కలిగిన శ్రామికవర్గానికీ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందించే పరిశ్రమలకూ విద్యావంతులైన మధ్యతరగతికీ నిలయంగా ఉండిన జర్మనీలో హిట్లర్ వంటి పరమ మూర్ఖుడు, యుద్ధోన్మాది...అలాగే నేరచరిత్ర కలిగిన అతని పార్టీ నేతలు ఎలా అధికారంలోకి వచ్చారు?'.
1920-30ల నాటి ఐరోపా ఖండంలోని పరిస్థితుల్ని గమనిద్దాం. పారిశ్రామికంగా అత్యంత వేగవంతమైన అభివృద్ధిని చవిచూసిన ఇంగ్లాండు లోనో లేదా జర్మనీ లోనో సోషలిస్టు విప్లవం వస్తుందని మార్క్స్‌తో సహా సిద్ధాంతకారులంతా ఊహించారు. ఆ దేశాల్లో పటిష్టమైన కార్మికవర్గం అప్పటికే సంఘటితమై ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థను నడిపించే దురాశ, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటుందని మార్క్సు సూత్రీకరించి ఉన్నాడు. 1929 నాటి ఆర్థిక సంక్షోభం, అతని మాటను నిజమని మరోసారి నిరూపించింది. రాత్రికిరాత్రే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వ్యాపారాలు మూతబడ్డాయి.
కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. లక్షలకొద్దీ ఉద్యోగులు, కార్మికులు వీధిన పడ్డారు. వారి కుటుంబాలు చితికిపోయాయి. ఇవన్నీ పెట్టుబడికి ఆలవాలమైన అమెరికా, ఐరోపాలలో జరిగినప్పటికీ, సంక్షోభపు దుష్ఫలితాలు ప్రపంచాన్ని కుదిపివేశాయి.
జర్మన్ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయింది. డబ్బుకి విలువ లేకుండా పోయింది. కరెన్సీ నోట్లు చిత్తుకాగితాలయ్యాయి. ఈ సంక్షోభానికి కారకులు యూదులే అని హిట్లర్ ప్రకటించాడు. ఆ అపవాదును గోబెల్స్ సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఫాసిస్టులు తమ రాజకీయ ఎదుగుదలకూ, ప్రత్యర్థులను తుదముట్టించడానికీ, ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్మూలించి, నిరంకుశాధికారాన్ని చేజిక్కించుకోవడానికీ అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటారని చరిత్ర ఘోషిస్తూనే ఉంది. కానీ ఆనాటికది కొత్త. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి, ఇతర ఐరోపా దేశాల అత్యాశకు బలికావడం మూలాన జర్మన్ ప్రజలలో పేరుకుపోయిన అసంతృప్తి, అవమానభారం కూడా నాజీలకు ఉపయోగపడింది.
గోబెల్స్ ప్రింటు మాధ్యమాన్ని, రేడియోను హస్తగతం చేసుకొని పూర్తిస్థాయిలో తిమ్మినిబమ్మి చేశాడు. ప్రజల్ని గందరగోళానికి గురిచేశాడు. హిట్లర్ విజయాలకు, నాజీ పార్టీ సృష్టిస్తున్న 'నూతన జర్మనీ'కి విశేషమైన ప్రచారం కల్పించాడు. నాజీ పార్టీ అభిప్రాయాలతో బహిరంగంగా విభేదించే అవకాశం లేకుండా చేశాడు. స్వచ్ఛమైన జర్మన్ రక్తం, అన్ని జాతుల్లోకీ మిన్న అయిన ఆర్యులదేననీ, మిగతా జాతులు పూర్తిస్థాయి మానవులే కాదనీ నాజీలు నమ్ముతారు.
నాజీ మూకలు యూదుల దుకాణాలపై, వ్యాపారాలపై దాడులు చేశాయి. యూనివర్సిటీలపై, గ్రంథాలయలపై దాడులు చేసి పెద్ద స్థాయిలో పుస్తకాలను తగలబెట్టారు. విద్యార్థి సంఘాలను నిషేధించారు. విద్యా వ్యవస్థను సమూలంగా 'సంస్కరించారు'.
ఒకనాటి అర్థరాత్రి కొంతమంది నాజీ గూండాలు పార్లమెంటు భవనానికి నిప్పంటిచారు. ఈ బృందానికి హిట్లర్ ప్రధాన అనుచరుడైన గోరింగ్ నాయకుడని అంటారు. పార్లమెంటును తగులబెట్టింది కమ్యూనిస్టులని ప్రకటించి ఆ పార్టీని నిషేధించారు. కమ్యూనిస్టు నాయకుల్ని దేశద్రోహులుగా చిత్రించి, జైళ్లకు పంపారు.
ఉదారవాదులతోనూ, సోషలిస్టులతోనూ నిండిన జర్మన్ పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ హిట్లర్‌నీ, అతని పార్టీ సభ్యుల్నీ చాలా కాలంపాటు జోకర్లుగా భావించి పట్టించుకోలేదు. నిజానికి హిట్లర్, కొద్దికాలం జైల్లో ఉన్నప్పుడు రాసిన 'మెయిన్ కాంఫ్' పుస్తకంలో తన లక్ష్యాలను, పథకాలను స్పష్టంగా వెల్లడించాడు. వాటినే ఆ తరువాత ఆచరణలో పెట్టాడు.
ఆర్థిక సంక్షోభం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని, యూదుల్నీ, బోల్షివిక్కుల్నీ జర్మన్ ప్రజలకు బద్ధశత్రువులుగా చిత్రించి, మేధావులను తూలనాడుతూ, ప్రత్యర్థులను హేళన చేస్తూ, వారి సమావేశాలను భగంచేస్తూ, వీధి రౌడీల ఎత్తుగడలను ఆచరిస్తూ, పార్లమెంటులో చర్చలు జరగకుండా అడ్డుకుంటూ, నాజీలు తమ నిరంకుశ అధికారానికి ఎదురులేకుండా చేసుకున్నారు. తమ ప్రత్యర్థుల్ని ఒక్కరొక్కరుగా నిర్మూలిస్తూ వచ్చారు.
యూదులు ప్రత్యేక గుర్తింపు పత్రాలను కలిగి ఉండాలని, భుజాలకు పచ్చరంగు గుడ్డను చుట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చెయ్యడంతో మొదలుపెట్టి, లక్షలాది యూదుల్నీ, రాజకీయ ప్రత్యర్థుల్నీ కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించి, గ్యాస్ చాంబర్లలో చంపించడం వరకూ నడిచిన నాజీల దుష్టచరిత్ర...మానవులలో ఇంత క్రూరత్వం ఉంటుందా అనిపించి జగుప్స కలిగిస్తుంది. తాను కారణ జన్ముడననీ, జర్మన్ ప్రజలను ఉద్ధరించడానికే తాను పుట్టాననీ హిట్లర్ దృఢంగా నమ్మాడు. ఒకవైపు పశ్చిమ రంగంలో ఫ్రాన్సు, ఇంగ్లాండులతో యుద్ధం జరుగుతూండగానే, మరోవైపు సోవియట్ యూనియన్‌పై ఆకస్మిక దాడి చేసి తూర్పు దిశగా కూడా యుద్ధరంగానికి తెర తీశాడు. 1941 జూన్ 22 నాటి దుర్దినాన 30 లక్షల మంది సైనికులతో జర్మన్ సైన్యం, సోవియట్ యూనియన్‌పై విరుచుకు పడింది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉభయ రంగాలలో యుద్ధానికి పూనుకోవడమే అతని సేనల పరాజయానికి ప్రధాన హేతువు. ఆరు నెలలపాటు సాగిన అత్యంత భీకరమైన స్టాలిన్‌గ్రాడ్ పోరాటంలో ఎర్ర సైన్యం ఘన విజయాన్ని సాధించింది. జర్మన్లపై ప్రతి దాడి మొదలైంది. సోవియట్ సైన్యం బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టినప్పుడు బంకర్‌లో తలదాచుకున్న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. యుద్ధానంతరం జర్మనీ రెండు ముక్కలైంది.
నాజీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్న క్రమం ప్రజాస్వా మ్యవాదులు వహించాల్సిన జాగరూకతకై హెచ్చరికగా చరిత్రలో మిగిలిపోయింది. అలాగే నాజీల పతనం తప్పదని... ప్రజాశక్తులదే అంతిమ విజయం అని ఢంకా బజాయించి చెబుతుంది. అయితే నాజీల ఎదుగుదల-పతనాల నడుమ లక్షలకొద్దీ సామాన్యులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే అత్యంత విషాదం.
నియంతలు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలు ఆర్థిక-సామాజిక సంక్షోభం, ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి, ఒక సమూహాన్ని శత్రువులుగా చిత్రించడం, బూటకపు ప్రచారం. జర్మన్ ప్రజలు జాగరూకతతో మెలిగి, ఆ నాటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఉంటే...? ఈ సందర్భంగా జర్మన్ మతగురువు నీల్ ముల్లర్ (1892-1984) మాటల్ని గుర్తుచేసుకోవాలి:
మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను మాట్లాడలేదు - ఎందుకంటే నేను కమ్యూనిస్టుని కాదు.
వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నేను మాట్లాడలేదు - ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టుని కాదు.
పిదప వారు కేథలిక్కుల కోసం వచ్చారు. నేను మాట్లాడలేదు - ఎందుకంటే నేను కేథలిక్కుని కాదు.
అప్పుడు వారు యూదుల కోసం వచ్చారు. నేను మాట్లాడలేదు - ఎందుకంటే నేను యూదుని కాదు.
చివరికి వారు నాకోసం వచ్చారు. నా కోసం మాట్లాడేందుకు ఇంకెవరూ మిగల్లేదు.
/ ఆపరేషన్ బార్బరోసా దాడి (22 జూన్, 1941)
జరిగి 82 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా /
వ్యాసకర్త సెల్ : ఉందుర్తి సుధాకర్, 9000 6010 68