రాజంపేట అర్బన్ : రైల్వే అండర్ బ్రిడ్జి సాధనే తమ లక్ష్యమని ఆర్‌యుబి సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. శనివారం వారు రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జి సదుపాయం లేక ఫ్లైఓవర్‌పై ప్రయాణం చేస్తూ ప్రజలు ప్రమాదాల భారిన పడుతున్నారన్నారు. బ్రిడ్జికి ఆవల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఉండడంతో ప్రతి నిత్యం ఈ దారిలో విద్యార్థులు, ప్రజలు వేలాదిమంది ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో పోరాటాలు చేయడం ద్వారా అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేయడంతో 90 శాతం పనులు పూర్తయ్యాయని, వైసిపి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేక నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రెవెన్యూ, పురపాలక శాఖ వారు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఒక మాసంలోపు రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమాలు ఉధ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిట్వేలి రవికుమార్, నాగోతు రమేష్ నాయుడు, కొల్లి రెడ్డెయ్య, వెంకటేష్, సుబ్బారాయుడు, సత్య కుమార్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.