Jul 17,2023 22:54

ప్రజాశక్తి-విజయవాడ: ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకొని మధురానగర్‌ ఆర్‌యుబి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఫుండ్కర్‌ ఆదేశించారు. మధురానగర్‌ ఆర్‌యుబి నిర్మాణ పనులు పునరుద్ధరణ సందర్భంగా ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ రవితేజ ప్రాజెక్టు ప్రతినిధులతో కలిసి కమిషనర్‌ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే గేటు - గద్దె వెంకట్రామయ్య పార్కు వీధి నుండి మధురానగర్‌ వైపు చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో రెండు నెలల పాటు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ప్రజలందరూ గమనించాలని కోరారు. గుణదల రైల్వేట్రాక్‌ వద్ద నూతన మంచినీటి సరఫరా పైపులైను పనులు ప్రారంభించినందున గుణదల మూడు బ్రిడ్జిలపై రాకపోకలు ఈ నెల 18 నుంచి పప్పుల మిల్లు వైపు మళ్లింపు చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లు బి.నరసింహ మూర్తి, వి.శ్రీనివాస్‌, బి.గురునాధబాబు, రవితేజ, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెనుమత్స శిరీష పాల్గొన్నారు.
మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సిఎస్‌ వై.శ్రీలక్ష్మి, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుండ్కర్‌ అంబేద్కర్‌ స్మతివనం పనులను సోమవారం పరిశీలించారు. అంబేద్కర్‌ స్మతి వనంలో ఏయే ప్రాంతంలో సుందరీకరణ పనులు ప్రారంభించాలో సిబ్బందికి సూచించారు.