
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రస్తుతం వర్షాభావం, ప్రాజెక్టు జలశయాల్లో నీటినిల్వలు తక్కువుగా ఉండటం వలన నాగార్జున సాగర్ కుడి కాల్వ ఆయకట్టు పరిధిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో జరిగిన జిల్లా 46వ నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు గురించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్‌ఇ మోహీద్దీన్ వివరించారు. కృష్ణాపశ్చిమ డెల్టా, గుంటూరు ఛానల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ కింద ఆయకట్టులో ప్రస్తుతం పంటల సాగు వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖాధికారి రవీందర్ వివరించారు.
మంత్రి రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు, తరువాత పులిచింతల నుంచి కృష్ణా జలాలు అందిస్తామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందన్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చే వరకు సాగర్ కుడి కాల్వ ఆయకట్టులో పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అందువల్ల వరి తప్ప ఇతర ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు. కృష్ణా పశ్చిమ డెల్టా కెనాల్‌లోని నీటిని సద్వినియోగం పరుచుకునేలా పటిష్ట ప్రణాళికతో వారాబందీకి షెడ్యూల్ రూపొందించి పంటలు అధికదిగుబడులు సాధించేలా సాగునీరు అందించేలా ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణాపశ్చిమ డెల్టాకు ప్రస్తుత సీజన్‌లో పంటలకు 14.60 టీఎంసీలు అవసరం ఉండగా, 11.00 టీఎంసీలు నీరు లభ్యత ఉందని, మిగతా 3.6 టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అనంతరం మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో గతంతో పోలిస్తే నీటి నిల్వలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 82.96 టీఎంసీల, నాగర్జునసాగర్ ప్రాజెక్టులో 154.99 టీఎంసీలు, పులిచింతల ప్రాజెక్టులో 21.36 టీఎంసీలు ఉన్నాయన్నారు. గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువుగా ఉందని, రైతులు ఆరుతడి పంటలు, నీటి మీద తక్కువ భారం పడే పంటలు వేసుకోవాలని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎం.హనుమంతరావు, సిహచ్.ఏసురత్నం, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జెసి జి.రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఇరిగేషన్ ఎస్‌ఇ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.