ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో మేడే వేడుకలను కార్మికులు సోమవారం ఘనంగా నిర్వహించారు. సిఐటియు, సిపిఎం, ఇతర కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యాన తెల్లవారుజాము నుంచే అరుణపతాక ఆవిష్కరణలు చేపట్టారు. ఓ పక్క జోరున వర్షం కురుస్తున్నప్పటికీ కార్మికులు, ఉద్యోగులు మేడే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నేతలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యపోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించగలమని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఏలూరు అర్బన్ : మే డే స్ఫూర్తితో బిజెపి ప్రజావ్యతిరేక మతోన్మాద కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నగరంలోని హనుమాన్‌నగర్, సుందరయ్య కాలనీ, కుమ్మరి రేవు, రాణి నగర్, తంగెళ్లమూడి, శనివారపుపేట, బావిశెట్టిపేట, పడమర వీధి, గాంధీ నగరం, చోడిదిబ్బ , కొత్తపేట, చేపలతూము సెంటర్, పత్తేబాద తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు సిపిఎం జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకవర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమజీవుల శ్రమను దోచుకుని, వారికి తగిన గుర్తింపు ఇవ్వడంలేదన్నారు. 150 ఏళ్ల క్రితం వెట్టిచాకిరీ చేయలేమని, ఎనిమిది గంటల పని విధానం కావాలని శ్రామిక వర్గం గలమెత్తిందని గుర్తు చేశారు. అమెరికాలోని చికాగోనగరంలో మే ఒకటో తేదీన జరిగిన మహాప్రదర్శన సందర్భంగా అక్కడి పోలీసులు అతిదారుణంగా జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి, గాయపడ్డవారి రక్తం నుండి పుట్టిన జెండానే ఈ ఎర్రజెండా అని కొనియాడారు. ఆనాటి వారి త్యాగానికి గుర్తుగా నేడు మనం మేడే జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, నగర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, గొట్టాపు రవి కిషోర్, కె.రామాంజనేయులు, వివిఎన్.ప్రసాద్, వైఎస్ కనకారావు, హైమావతి, అరుణ, చింతాడ వెంకటలక్ష్మి, సిహెచ్.రాజ్యలక్ష్మి, కంది విశ్వనాథం, జి.ఏసుబాబు టి.దుర్గ పాల్గొన్నారు.
స్థానిక పవరుపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఎగురవేశారు. పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, నగర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాధరావు,,పి.గోపి, కోటేశ్వరరావు, జాన్‌డాబాబు, శారద, ప్రసాద్, రామాంజనేయులు, సుధకార్ పాల్గొన్నారు.
వర్షంలోనూ తెల్లవారుజాము నుంచే పతాకావిష్కరణలు
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏలూరులో సిఐటియు ఆధ్వర్యాన మేడే ర్యాలీ, సభ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే కార్మికులు పని ప్రదేశాల్లో సిఐటియు పతాకాలను ఆవిష్కరించారు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొత్తూరు జ్యూట్ మిల్లు, భవన నిర్మాణ, ఆటో, హమాలీ, అంగన్వాడీ, ఆశ, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఆర్‌టిసి వివిధ తరగతుల కార్మికులందరూ సిఐటియు జెండాలను ఎగురవేశారు. అనంతరం పది గంటలకు ఆర్‌ఆర్ పేట పార్కు వద్ద నుండి సిఐటియు మేడే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్‌పేట పార్కు వద్ద నుండి రమామహల్ సెంటర్, గాంధీనగర్, పవర్ పేట రైల్వే స్టేషన్ మీదుగా సాగింది. అనంతరం పవర్ పేట సిఐటియు ఆఫీస్ వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభకు సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్, సిఐటియు నగర కార్యదర్శి వి.సాయిబాబు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణారావు, ప్రసాద్, జి.రవికిషోర్, పి.వెంకటరమణ, ఎ.ఉషారాణి పాల్గొన్నారు.
ఐఎఫ్‌టియు ఆధ్వర్యాన : మేడే సందర్భంగా ఏలూరులో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలను ఎర్రజెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు తమ జెండా స్తూపాల వద్ద, కార్యాలయాల వద్ద, వివిధ సెంటర్లలో తోరణాలతో అలంకరించారు. ఏలూరు మార్కెట్ యార్డ్ వద్ద జెండా ఎగురవేశారు.
ఎపి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వట్లూరు స్టోర్స్ వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టోర్స్ ఆవరణలో యూనియన్ జెండాను యూనియన్ డిస్కం అధ్యక్షులు భూక్యా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ స్తూపానికి ఎపిఇపిడిసిఎల్ ఏలూరు సర్కిల్ ఎస్‌ఇ పి.సాల్మన్‌రాజు, ఏలూరు ఆపరేషన్ ఇఇ టి.శశిధర్, ఏలూరు ఆపరేషన్ సీనియర్ అకౌంటెంట్ కె.సత్యకిషోర్ పూలమాలలు వేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులను, కార్మికులను ఘనంగా సత్కరించారు.
సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ వద్ద సిపిఐ పతాకాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య ఆవిష్కరించారు. సిపిఐ స్థూపానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పూలమాల వేశారు. అనంతరం సిపిఐ కార్యాలయం నుండి ఆర్‌ఆర్ పేట మీదగా ఎన్‌టిఆర్ పార్క్ వరకూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
పవర్‌పేట వాసు దేవాలయం ప్రాంతంలో మేదర్ల ఆధ్వర్యాన మేడే ఉత్సవ కమిటీ సభ్యులు కట్టా సత్యనారాయణ, గుడిపాటి నరసింహారావు, విజిఎం.కృష్ణారావు, ఎ.సత్యనారాయణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కోలా కృష్ణారావు, విజిఎం.కృష్ణారావు, ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఏలూరు టౌన్ : మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఏలూరు కార్పొరేషన్‌లోని వివిధ సర్కిళ్లలో మేడేను జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం, తంగెళ్లమూడి, రైతు బజార్, మధులత సెంటర్, కండ్రికగూడెం, కొత్తపేట, చోడిదిబ్బ, ఆదివారపుపేట, వంగాయగూడెంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అరుణ పతాకాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.జాన్‌బాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి వి.సాయిబాబు, సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు, సిఐటియు జిల్లా నాయకులు మావూరి శ్రీనివాస్, పి.శివకుమార్ పాల్గొన్నారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో ఒవర్ బ్రిడ్జ్ సెంటర్, శనివారపుపేట, రమామహల్ సెంటర్, గడియారం స్తంభం సెంటర్, తంగెళ్లమూడి సెంటర్, పాండురంగ థియేటర్ సెంటర్ తదితర ప్రాంతాల్లో మేడే జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు యర్రా రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, సిఐటియు నాయకులు జె.గోపి జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పెంటర్ వర్కర్ల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు, ప్రజలకు మామిడి పండ్లను పంపిణీ చేశారు.
ఆటో డ్రైవర్లకు సమగ్ర సంక్షేమ బోర్డును సాధించుకునేందుకు మేడే స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలని ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధ నాగసూరి బాబు, జె.గోపి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నగరంలో వివిధ ఆటో స్టాండ్లలో సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆటో ర్యాలీని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య జెండా ఊపి ప్రారంభించారు. తీన్మార్ డప్పులతో ఆటోలకు ఎర్రజెండాలు కట్టుకొని పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఆటో యూనియన్ నాయకులు చక్రాల అమర్‌కుమార్, జివి.రవీంద్రబాబు, ఎం.ఇసాక్, గణేష్, శివరామకృష్ణ, రాఘవ, నల్ల బాపినీడు, బొడ్డు వరప్రసాద్, నాని, మాత్రపు రమేష్ నాయకత్వం వహించారు.
ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. స్థానిక వంగాయగూడెం వెహికల్ డిపో వద్ద క్లాప్ డ్రైవర్లు మేడే జెండా ఎగరవేశారు. సిఐటియు పతాకాన్ని జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు, ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లాప్రధాన కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.
నూజివీడు రూరల్ : మేడే సందర్భంగా నూజివీడు పట్టణ, రూరల్ గ్రామాల్లో సిపిఎం, సిఐటియు నాయకులు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. పట్టణంలోని ఐదు సెంటర్లలో సిపిఎం జెండాను, 15 సెంటర్లలో సిఐటియు జెండాలను ఎగురవేశారు. అనంతరము స్వీట్లు పంచారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రధాన సెంటర్లలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.రాజు, దుర్గారావు, శోభనాద్రి, నాగరాజు, మహేష్ భీమయ్య, జిలాని, ప్రభాకర్ పాల్గొన్నారు.అలాగే నూజివీడు పట్టణంలోని 15 సెంటర్లలో సిఐటియు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు అరుణ పతాకాలను ఎగరవేశారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వర్షాన్ని లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజమల్లు, రజిని, గోవిందు, రాజేష్, రాంబాబు, నాయుడు, నాగూరు, నాగు, కళ్యాణ్, కమల, నాగమణి, అన్నపూర్ణ పాల్గొన్నారు.
భీమడోలు:శ్రామికులను, వారి శ్రమను గౌరవించడం, గుర్తించడం ద్వారా సమాజం ప్రగతి పథంలో పయనిస్తుందని భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్ అన్నారు. మే డే సందర్భంగా భీమడోలు జంక్షన్‌లో జరిగిన బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సిఐటియు మండల అధ్యక్షురాలు స్వర్ణకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ శ్రమ లేకుండా సంపద పెరగదని, శ్రమజీవుల శ్రామికుల కష్టానికి తగిన ఫలితం వస్తేనే సమాజాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, నాయకులు సాల్మన్‌రాజు, మోహన్, న్యాయవాది రాజారావు, అనిల్, కెవిపిఎస్ మండల కన్వీనర్ టి.సుమన్‌బాబు పాల్గొన్నారు.
పూళ్ల, గుండుగొలను, తిరుమల పాల ఫ్యాక్టరీ, పాతూరు పౌరసరఫరాల సంస్థ గోదాములు, భీమడోలు జంక్షన్, కోకో కోలా ఫ్యాక్టరీల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బెండి శ్రీనివాసరావు, బి.రాజమణి, పి.రాఘవ, గడ్డి సూర్యారావు, ఆర్.లింగరాజు, డ్రైవర్స్ యూనియన్ నాయకులు రమేష్ అరుణ పతాకావిష్కరణలో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:మే డే సంబరాలను కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో పి.సూర్యారావు అధ్యక్షతన సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడారు. అలాగే మున్సిపల్ కార్మికులు, ఆటో, బిల్డింగ్, ఆర్‌టిసి వర్కర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పాత మున్సిపల్ కార్యాలయం, మార్కెట్, మున్సిపల్, సిఐటియు, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద, బస్టాండ్ వద్ద, సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సుభాని, గోపి, సిహెచ్.మాణిక్యాలరావు, సత్తిబాబు, రేలంగి నాగరాజు, బాలరాజు, వేల్పుల రాజు పాల్గొన్నారు.
సత్కారాలను బహిష్కరించిన పారిశుధ్య కార్మికులు
ఈ సందర్భంగా మున్సిపల్ అదికారులు ఏర్పాటు చేసిన మే డే సత్కారాలను పారిశుధ్య కార్మికులు బహిష్కరించారని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె సుభాషిణి తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఇద్దరికి మాత్రమే మున్సిపల్ అధికారులు మేడే సత్కారాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించకుండా, సమస్యలు పరిష్కరించకుండా కేవలం మేడే రోజున శాలువాలతో ఇద్దరిని సత్కరించడం వల్ల పారిశుధ్య కార్మికులకు ఒరిగేదేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడమే వారికి నిజమైన సత్కారమన్నారు. కార్మికుల శ్రమను గుర్తించి కనీస వసతులు, వేతనాలు పెంపు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సుభాషిని కోరారు.
జంగారెడ్డిగూడెం : మేడే స్పూర్తితో కార్మిక, కర్షకులు చట్టాలను కాపాడుకావాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద మేడే జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌కె.సుభాషిణి, పట్టణ కన్వీనర్ పి.సూర్యారావు పాల్గొన్నారు. ఎంపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి.సూర్య కిరణ్, ఎ.ప్రభాకర్‌రావు, వై.సీత, బి.రాంబాబు, పట్టణ కమిటీ నాయకులు వి.గోపి, సిహెచ్.మాణిక్యాలరావు, ఎస్‌కె.మాబు సుభాని, ఎ.రామచంద్రం పాల్గొన్నారు.
చింతలపూడి : కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ అన్నారు. మండలంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, సిటీ మెడికల్, సిఐటియు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి, పైర్‌స్టేషన్ సెంటర్, ఆటోస్టాండ్, అంగన్‌వాడీ కార్యాలయం, గోద్రేజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వద్ద సిఐటియు జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్.నారాయణ, మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరావు, జఫ్రుల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆశా వర్కర్స్ యూనియన్, అంగన్‌వాడీ వర్కర్స్, ఆటో యూనియన్, యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కైకలూరు : మేడే సందర్భంగా కైకలూరు వీధుల్లో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాలు అరుణ పతాకాలను ఎగురవేశారు. శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ పలువురు నాయకులు కార్మికులతో కలిసి ర్యాలీ చేశారు. తాపీ వర్కర్స్ యూనియన్, శ్రీశ్యామల ముఠా వర్కర్స్ యూనియన్, ఆటో, ఎలక్ట్రికల్, ఆశ , అంగన్వాడీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కార్మిక సోదరులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కురేళ్ల లాజరు, నాగిరెడ్డి కొండ, త్రిమూ ర్తులు, ఎంపిపి వెంకట కృష్ణ మోహన్, సర్పంచి దానం మేరి నవరత్నకుమారి పాల్గొన్నారు.










