Nov 01,2021 08:50

ఆకాశంలో సగం.. అవనిలో సగం అన్నట్లు.. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులకు తామేమీ తక్కువ కాదన్నట్లు గ్రామాల నుంచి పట్టణాల వరకూ.. అన్నిరంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. జనగాం జిల్లాలోని ఘనపూర్‌కు చెందిన మహిళలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశారు. 'సిరి' ధాన్యాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. మొదట ఆరుగురి సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఐదు వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.. వ్యాపార రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి వారు విజయానికి చేరువయ్యేందుకు తీసుకున్న చర్యలు.. ప్రణాళికలు.. తదితర విషయాలు ఏమిటో తెలుసుకుందాం..!

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు. కానీ, ఆలోచనపరంగా చూసుకుంటే ఇద్దరూ సమానమే అన్న భావన ప్రస్తుత సమాజంలో కలుగకమానదు. అందుకు కారణం అక్కడ మహిళలూ పురుషులతో సమానంగా రాణిస్తుండటమే. పురుషాధిక్య సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తుండటం ద్వారా వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. తెలంగాణాలో జనగాం జిల్లాలోని ఘనపూర్‌ మహిళలు సిరి ధాన్యాల వ్యాపారంలో దూసుకుపోతూ వారి ప్రతిభను నలుదిక్కులా చాటుతున్నారు. వీరంతా వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తూ సక్సెస్‌ఫుల్‌ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
 

                                                   ఆరుగురితో ప్రారంభమై..

జనగాం జిల్లాలోని ఘన్‌పూర్‌ మండలానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు మిల్లెట్‌ (సిరి ధాన్యాల) వ్యాపారాన్ని ప్రారంభించి, అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాకతీయ మహిళా మాక్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యం, వారి సలహాలు, సూచనలతో ఘనపూర్‌ మహిళలు చాలామంది మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కినోవా, జోవర్‌, ఇతర రకాల సిరి ధాన్యాలను విక్రయించే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో కాకతీయ మహిళా మాక్‌ లిమిటెడ్‌తో కలిసి దాదాపు 500 మంది మహిళలు పనిచేస్తున్నారు.
సీఈవో తాళ్లపల్లి వెంకటస్వామి సహాయంతో స్థానిక మహిళలు, కాకతీయ మహిళా మాక్స్‌ లిమిటెడ్‌ సభ్యులు కలిసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను తెరిచారు. తద్వారా వీరంతా వీటి వలన కలిగే ప్రయోజనాలపై ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజైన మార్చి 08, 2021న కేవలం ఆరుగురు సభ్యులతో చిన్న సంస్థగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుండడంతో నెమ్మదిగా విస్తరిస్తూ వచ్చారు. కేవలం రూ. రెండు లక్షలతో ప్రారంభమైన మొదటి యూనిట్‌ క్రమంగా అనతి కాలంలో అనేక యూనిట్లుగా రూపాంతరం చెందుతూ వచ్చి విజయాలను సొంతం చేసుకుంటోంది.
    దీనిపై సంస్థ సీఈవో తాళ్లపల్లి వెంకటస్వామి 'ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'తో మాట్లాడుతూ ప్రస్తుతం కంపెనీలో మొత్తం 5,000 మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తి తరువాత పోషకాహారం ఎక్కువగా ఉండే ఆహారానికి విపరీతంగా డిమాండ్‌ పెరిగిందన్నారు. మిల్లెట్లలో డైటరీ ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని, తాము సేంద్రీయ పద్ధతుల్లో తయారయ్యే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లను స్థాపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదట కేవలం ఆరుగురు మహిళలతో ప్రారంభమైన ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ప్రస్తుతం 500 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తాము నేరుగా రైతుల నుండి వేలి (రాగులు), జొన్న, ఫాక్స్‌టైల్‌ (కొర్ర) వంటి రకాల సిరి ధాన్యాలను కొనుగోలు చేస్తున్నామని, ప్రస్తుతం రైతుల నుంచి మూడు టన్నుల సిరి ధాన్యాల కొనుగోలు కోసం ప్రతి నెలా రూ. రెండు లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

 

ఆరుగురితో ప్రారంభం.. ఐదువేల మందికి ఉపాధి..


     ఈ మహిళలు ఇప్పటికే జిల్లాలో 10 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జి) కోసం పనిచేస్తున్న జి కవిత మాట్లాడుతూ.. స్వల్పకాల వ్యవధిలో తాము ఈ విజయాన్ని సాధిస్తామని ఊహించలేదన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయగలుగుతామనే నమ్మకం తమకు ఉందన్నారు. స్థానిక మహిళా గ్రూపులకు అవగాహన కల్పించడానికి తాము అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నామని, తమ గ్రూపులోని ప్రతి సభ్యురాలు నెలకు రూ. 10,000 నుండి రూ .15,000 సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.