Sep 19,2023 23:37

బాధితునితో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - బెల్లంకొండ : మండలంలోని మాచయ పాలెంలో దళితుడైన సోమబత్తిని సుందరావును కులం పేరుతో దూషించి దాడి చేసిన పెత్తందారుడు కర్నాటి రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే కేసు నమోదుతోపాటు అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. రెండ్రోజుల కిందట మాచయపాలెంలో జరిగిన ఘటనలో బాధితుణ్ణి రవిబాబు మంగళవారం పరామర్శించారు. సెంటర్లో కూర్చొని వేరే వ్యక్తితో మాట్లాడుతున్న సుందర్రావును.. నువ్వు మాలోడివి.. కులం తక్కువ వాడివి.. నువ్వు మా ప్రక్కన అరుగు మీద కూర్చుంటావా... అంటూ రమేష్‌ బూతులు తిట్టాడని, దీన్ని ప్రశ్నించినందుకు సుందర్రావుపై దాడి చేశాడని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని అన్నారు. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని రవిబాబు హెచ్చరించారు. పరామర్శించిన వారిలో టి.హనుమంతరావు తదితరులున్నారు.