ఊహలకు మొగ్గతొడిగి విచ్చుకుంటే ఎలా ఉంటాయో అవే ఆర్చిడ్స్ పూలమొక్కలు. ప్రపంచంలో వేల రకాల ఆర్చిడ్స్ పూల మొక్కలున్నాయి. ఇవి వివిధ రంగుల్లో కొలువుతీరి, విభిన్న ఆకారాల్లో ఆకట్టుకుంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వారం 'విరితోట'లో విహరించాల్సిందే.
ఆర్చిడ్స్ చిన్నదుంప నుంచి కొమ్మలు వచ్చి, పూలు పూస్తాయి. మట్టి కాకుండా బొగ్గులు, కొబ్బరిపొట్టు మిశ్రమంలో ఈ మొక్కలు బాగా పెరిగి పుష్పిస్తాయి. వీటిలో కర్బన పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇవి ఇండోర్, సెమీషేడ్‌లో పెంచుకునే మొక్కలు. కుండీల్లోనే ఎక్కువగా పెరుగుతాయి. శీతల దేశాల్లో ఈ మొక్కలు బాగా విచ్చుకుంటాయి. వీటికి నీటి వనరు చాలా తక్కువ అవసరం. వాడుకలో వీటిని ''ఆర్కిడ్స్'' అనీ అంటాము.
హ్యాంగింగ్..
చిన్న చిన్న వేలాడే కుండీల్లో పెరిగే ఆర్చిడ్స్ మొక్కలను ''హ్యాంగింగ్ ఆర్చిడ్స్'' అని పిలుస్తారు. కుండీల నుంచి పువ్వులు గుత్తులుగా కురులు విరబోసినట్లు కిందికి వేలాడుతూ ఉంటాయి. వీటిలో వేల రంగులు, వందల రకాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ మొక్కలను కుండీలలో పెట్టకుండా, గాలిలో వేలాడదీసినా నీటిలో తేమను తీసుకునీ ఇవి పెరుగుతాయి.
స్టార్..
ఆర్చిడ్స్ మొక్కల్లో ముఖ్యమైనది, విలువైనది ''స్టార్ ఆర్చిడ్స్''. పువ్వు ఒక బంతిలా ఉండి, దానికి చుట్టూతా మీసాల్లాంటి పుప్పొళ్ళు రంగు రంగులతో ఎంతో అందంగా ఉంటాయి. అన్ని ఆర్చిడ్స్‌లా ఈ పూలమొక్క ఆకులు కూడా సన్నగా, పొడవుగా, ఆకుపచ్చగా ఉంటాయి. పువ్వు కొద్దిగా సువాసన వస్తుంది. మొక్కకి ఒకదాని తరువాత ఒకటి పూస్తుంది. ఒక్కో పువ్వు వారాల తరబడి వికసించి, తాజాగా ఉంటుంది.
ట్రిగ్..
సన్ననిరేఖ వంటి పూలను గుత్తులు గుత్తులుగా పూసే మొక్క ''ట్రిగ్ ఆర్చిడ్స్''. తెలుపు, ఎరుపు, నీలం, పర్పుల్, గులాబి, పసుపు, గోధుమ రంగుల్లో నాజూగ్గా పూలగుత్తులు భలే అందంగా ఉంటాయి. మొక్క నుంచి ఆర్చిడ్స్ పూలగుత్తులు తుంచిన వారం వరకూ తాజాగానే ఉంటాయి. అందుకే ఖరీదైన డెకరేషన్‌కి వీటిని ఉపయోగిస్తారు. చల్లని ప్రాంతాల్లో (ఏ.సీ) ఈ డెకరేషన్ మరింత నిగారింపుగా ఉంటుంది.
షేప్డ్..
జంతువులు, పక్షులు, వస్తువులు ఆకారాలు పోలినట్టు వింత వింత రూపాల్లో వుండే షేప్డ్ ఆర్చిడ్స్ ఎంతో ఆకర్షణగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో బాగా విచ్చుకుంటాయి. ఆకులు చిన్నగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత పెరిగితే ఇవి చనిపోతాయి. ఆర్చిడ్స్ మొక్కలను వేసవిలో ఎక్కువగా సంరక్షించుకోవాలి.
టేబుల్..
చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉండేవి ''టేబుల్ ఆర్చిడ్స్''. మొక్క సన్నగా నాజూగ్గా ఉండి విరివిగా పువ్వులు పూస్తాయి. ఒక్కో మొక్క ఒక్కో రంగు పువ్వులు పూస్తుంది. పువ్వులు ఎంతో సుతిమెత్తగా ఉంటాయి.
షేడ్ నెట్లలో పెంపకం..
అలంకరణకు ఆర్చిడ్స్ పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఒకప్పుడు వీటిని శీతల దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు రైతులు ఇక్కడే షేడ్ నెట్లు వేసి, నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ట్రిగ్ తరహా ఆర్చిడ్స్ పూల సాగు చేస్తున్నారు. ప్రత్యేకమైన కుండీల్లో ఈ తోటలు పెంచుతున్నారు.
* చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506