ప్రజాశక్తి-అద్దంకి: మండలంలోని వేలమూరిపాడు గ్రామంలో ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు గత ఆరువారాలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు గురువారం డిమాండ్ చేశారు. కూలీల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ గత ఆరువారాల నుంచి వేతనాలు చెల్లించలేదని రోజువారి కూలి చేసుకొని బతికే మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కూలీలు తెలియజేశారు. తీవ్రమైన ఎండలో పనిచేసిన కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమైన విషయం అన్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటన చేసి కూలీలందరినీ ఐక్యం చేసి పెద్దఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు తెలియజేశారు. అదే విధంగా కూలీలకు కనీస రోజు వేతనం రూ.600 ఇవ్వాలని, సంవత్సరంలో కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. పొరుగునున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 350 రూపాయలు వేతనం ఇస్తున్నారని అన్నారు. సమ్మర్ అలవెన్సు, మంచినీళ్లు, పలుగు, పార అలవెన్సులు కూడా ఇవ్వాలని, పాత గ్రూపుల విధానం అమలు చేయాలని, అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, రవి, అంజయ్య, కూలీలు పాల్గొన్నారు.










