Jul 23,2021 20:11

* ఆగస్టు 16 నుంచి బడులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్యలో తాజాగా మరో విధానాన్ని తెరపైకి తెచ్చింది. నూతన విద్యావిధానంలో భాగంగా 172 సర్క్యులర్‌ ద్వారా 5+3+3+4 విధానాన్ని అమలు చేస్తామని మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఆరు రకాల పాఠశాలలు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. విద్యాశాఖపై తన క్యాంపు కార్యాలయంలో సిఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కొత్త విద్యావిధానంలో శాటిలైట్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌, ప్రీహైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలు ఉంటాయని చెప్పారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో అంగన్‌వాడీల నుంచే ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభమవుతుందన్నారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు ఉంటాయని తెలిపారు. శాటిలైట్‌ ఫౌండేషన్లకు ఫౌండేషన్‌ స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఎస్‌జిటి టీచర్లు పర్యవేక్షణ ఉంటుందన్నారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుందని, ఫౌండేషన్‌ స్కూల్‌ కిలోమీటర్‌లో ఉంటుందని చెప్పారు. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుందని, ఆ పరిధి దాటి ఒక్క స్కూలూ కూడా ఉండదన్నారు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు. అదేరోజు నూతన విద్యావిధానం విధి,విధానాలపై ప్రకటన ఉంటుందన్నారు. ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 16 నాటికి విద్యాకానుక సన్నద్దంగా ఉండాలని సిఎం ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, పాఠశాల విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు బి రాజశేఖర్‌, ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు పాల్గన్నారు.

కొత్త పాఠశాలలు ఇలా..
పాఠశాల పేరు                                తరగతులు

శాటిలైట్‌ ఫౌండేషన్‌                         ప్రి ప్రైమరీ-1, ప్రి ప్రైమరీ-2
ఫౌండేషన్‌                                     ప్రి ప్రైమరీ-1, ప్రి ప్రైమరీ-2, 1,2 తరగతులు
ఫౌండేషన్‌ ప్లస్‌                               ప్రి ప్రైమరీ-1, ప్రి ప్రైమరీ-2, 1,2,3,4,5 తరగతులు
ప్రీ హైస్కూల్‌                                  ప్రి ప్రైమరీ-1, ప్రి ప్రైమరీ-2,1,2,3,4,5,6,7 తరగతులు
హైస్కూల్‌                                     3 నుంచి 10వ తరగతి వరకు
హైస్కూల్‌ ప్లస్‌                               3 నుంచి 12వ తరగతి వరకు

టెన్త్‌ విద్యార్ధులకు మార్కులు..
పదో తరగతిా2021 సంవత్సరాల విద్యార్ధులకు మార్కులు ఇవ్వనున్నట్లు అధికారులు సిఎంకు వివరించారు. స్లిప్‌టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా 30శాతం మార్కులు ఇస్తామన్నారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడించారు. 2020 విద్యార్థులకూ మార్కులు ఇస్తామన్నారు.