Jul 30,2023 21:25

ఆరు నెలల చిన్నారికి అంతర్జాతీయ అవార్డుబుడతడికి నోబెల్‌ వరల్డ్‌ రికార్డు

ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌)
ప్రజ్వల్‌ అనే ఆరు నెలల చిన్నారి అంతర్జాతీయ అవార్డు సాధించి అందరినీ అబ్బుర పరిచాడు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని శాస్త్రినగర్‌కు చెందిన పవన్‌కుమార్‌, సౌమ్యప్రియ దంపతులకు నాలుగేళ్ల వినీషతోపాటు ఆరునెలల కుమారుడు ఉన్నాడు. ఆరునెలల బుడతడు నోబెల్‌ వరల్డ్‌ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అతడి తల్లి జంతువులు, పండ్లు, వాహనాలు, అంకెలు, పక్షులు, కూరగాయల ఫొటోలు చూపి వాటిపేర్లను అడిగిన వెంటనే ప్రజ్వల్‌ ఠక్కున గుర్తించి అబ్బురపరుస్తున్నాడు. చిన్నారికి గ్రహించగల్గిన శక్తి వచ్చినప్పటి నుంచి ఫొటోలు చూపి వాటి పేర్లను చెప్పడాన్ని తల్లి సౌమ్య అలవాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మొబైల్‌లో చిత్రీకరించి ఈనెల 19న నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థకు పంపారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఆ చిన్నారి ప్రతిభను మెచ్చి ఈనెల 29న ఆన్‌లైన్‌ ద్వారా అవార్డును పంపారు. వారి కుమార్తె వినీష కూడా నాలుగేళ్ల వయస్సులోనే ఐదు అవార్డు సాధించి అబ్బురపరిచిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్నారికి అంతర్జాతీయ అవార్డు రావడంతో ఇరుగు పొరుగువారు, బంధువులు అభినందిస్తున్నారు. కాగా ప్రజ్వల్‌ తండ్రి పట్టణంలోనే వివేకానంద క్లాత్‌ మార్కెట్‌లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి గృహిణిగా ఉన్నారు.అంతర్జాతీయ అవార్డుతో ప్రజ్వల్‌