ప్రజాశక్తి-రాజవొమ్మంగి
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయుల విద్యాబోధన ఉండాలని జిల్లా విద్యాశాఖధికారి పి.రమేష్ అన్నారు. స్థానిక ఎంఆర్‌సి కార్యాలయంలో ఎంఈఓ కె.తాతబ్బాయిదొర ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు అక్షరాలపై పూర్తి అవగాహన వచ్చేలా ఉపాధ్యాయుల శ్రద్ధ చూపాలన్నారు. బోధన మెళుకువలు ఉపాధ్యాయులు తెలుసుకొని, బోధనతీరులో క్రమంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా విద్యాబోధన ఉండాలన్నారు. విద్యార్థులకు కనీసం సరళపదాలతో ఆంగ్లంలో చదవడం, రాయడంపై ఆసక్తిని కలిగించాలన్నారు. విద్యార్థులలో కనీస మార్పులు కనిపించకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఆర్పీలు విష్ణు, శ్రీను, పలు పాఠశాలల హెచ్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.










