ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
సిఎం జగన్ దారిమళ్లించిన ఆర్థికసంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయాలని కోరుతూ ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ ఛాంబర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిఎం జగన్ సర్పంచులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను అధ్వానంగా తయారు చేశారని, పారిశుధ్యం పడకేసిందన్నారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేయడమే కాకుండా 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.8660 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి సర్పంచులకు నిధులు, అధికారాలు, విధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పిల్లి సత్తిరాజు, సర్పంచుల సంఘం అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం నుంచి చేబ్రోలు, ఉంగుటూరు, నారాయణపురం, సీతారాంపురం గ్రామాలకు చెందిన మహిళా సర్పంచులు రాంథే లక్ష్మీసునీత, బండారు సింథు, దిడ్ల అలకనంద, బళ్ల రాధ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే లాగేసుకోవడం దుర్మార్గచర్య అని, సర్పంచులకు విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.










