ఆర్థికంగా చితికిపోయిన బాలికకు కెజిబివిలో సీటు
- ఫలించిన జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారద ప్రయత్నం - బాలికకు డోన్ ఆర్‌డిఒ ఆర్థిసాయం
ప్రజాశక్తి-డోన్
డోన్ మండలం ఆవులదొడ్డికి చెందిన 14 యేళ్ల బాలికను సోమవారం సిడిపిఒ సమక్షంలో కస్తూరిబాగాంధీ పాఠశాలలో సోమవారం 8వ తరగతిలో చేర్పించారు. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..... బాలిక తల్లి సాయి సుజాత, తండ్రి సాయి సాలన్నది పేదకుటుంబం అయినప్పటికీ అమ్మాయిని ఓ ప్రయివేటు పాఠశాలలో 4వ తరగతి వరకు చదివించారు. ఇటీవల కుటుంబం అర్థిక పర్థితులు పూర్తిగా బలహీన పడటంతో తండ్రి మద్యానికి బానిసయి తల్లికూతురును వదిలి వెళ్లాడు. తప్పటిని పరిస్థితిలో తల్లి కూతురు ఆవుల దొడ్డి గ్రామం వదిలి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ చిత్తుపేపరు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. బాలల సంరక్షణకు కోసం నియమించిన 1098 సిబ్బంది గమనించి ఉమ్మడి జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారదకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఆవులదొడ్డికి వెళ్లి సిడిపిఒ సిబ్బంది విచారించారు. బాలిక మేనమామల సహాయంలో హైదరాబాద్ చిరునామా తెలుసుకుని తల్లికి నచ్చజెప్పి బాలికను ఆవులదొడ్డికి రప్పించారు. అందరూ ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో బాలిక భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉమ్మడి జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారద, నంద్యాల జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి నాగసువచ్చలతో మాట్లాడి డోన్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయలో చేర్పించారు. సోమవారం డోన్ పట్టణంలోని జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారద, ఐసిడిఎస్ సిడిపిఒ ఎస్.షంషాద్ బేగం, ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి, కామగానిగుంట్ల మహిళా సంరక్షణ కార్యదర్శి మౌలాబి, ఒఆర్‌డబ్ల్యు శ్వేత కీర్తి, సోషల్ వర్కర్ నరసింహులు ఆధ్వర్యంలో బాలికను కెజిబివి పాఠశాలలో ప్రిన్సిపల్ జోషి హెలెన్ సమక్షంలో చేర్పించారు. బాలిక విషయంపై డోన్ ఆర్‌డిఒ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బాలికకు ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేలు ఆర్థిక సహాయం అందించారు. బాలికకు సీటు విషయంలో సహాయం చేసిన నంద్యాల జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి నాగ సువచ్చలకు, డోన్‌లో బాలికకు సంబంధించిన పూర్తి విషయాలు సహాయం చేసిన ఐసిడిఎస్ సిడిపిఒ ఎస్.షంషాద్ బేగం, ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి, కామగానిగుంట్ల మహిళా సంరక్షణ కార్యదర్శి మౌలాబికి, బాలికకు ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేల అందజేసిన డోన్ ఆర్‌డిఒ వెంకటరెడ్డికి ఉమ్మడి జిల్లా బాలల సంరక్షణ అధికారిణి టి.శారద కృతజ్ఞతలు తెలిపారు.










