Dec 23,2022 21:57

కార్పొరేట్ల విన్యాసాలు, ప్రభుత్వ విధానాల ఫలితమే మాంద్యం
సదస్సులో మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాయడం వల్లే సామాన్యులు కొనుగోలు శక్తి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నారని, ఆర్థిక వ్యవస్థపై యువత దృష్టి సారించి కార్పొరేట్‌ శక్తుల ఆగడాలను అడ్డుకున్ననాడే దేశ పురోగతి సాధ్యమని మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ అన్నారు. సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా 'ప్రపంచ ఆర్థిక మాంద్యం-కారణాలు-పరిష్కారాలు' అనే అంశంపై సెమినార్‌ శుక్రవారం స్థానిక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాలులో జెఎన్‌వి.గోపాలన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన వక్త శర్మ మాట్లాడుతూ కార్పొరేట్ల వ్యాపార విన్యాసాలతో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. గతంలో విద్య, వైద్యం కొంత బాగున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వాలు ఈ రెండింటినీ పక్కన పెట్టేశాయన్నారు. ఉపాధి హామీ చట్టం కింద అవసరమైన పనులు చేయించుకోవచ్చని, అయితే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూడం దారుణమని అన్నారు. గతంలో శాసనమండలిలో తాను విశాఖ జిల్లా గంగవరం పోర్టుకు ఎకరం రూపాయి చొప్పున 1800 ఎకరాలు ఇవ్వడంపై ప్రశ్నించగా ఉచితంగా ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పారన్నారు. కార్పొరేట్‌ రాజు బ్యాంకుల్లో అప్పు తెచ్చి అక్కడ 29 బెర్త్‌లు కట్టగా అదానికి ఆ బెర్త్‌లు అమ్మినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడకుండా కాగితం రాసి ఇచ్చారన్నారు. కరోనా సమయంలో అమెరికా వంటి దేశాలు ప్రజలపై పన్నుల భారం తగ్గించడమే కాకుండా ఇంటి అద్దెలు కూడా చెల్లించాయని గుర్తు చేశారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా సమయంలో చాలా నష్టపోయామని ప్రధాని చెబుతున్నారని, ఒక్క పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు పన్ను వేసి రూ.6.30 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. అదే సమయంలో వలస కూలీలు కాలినడకన వెళ్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. కార్పొరేట్లకు రాయితీల మీద రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజల నుంచి ఇంటి పన్ను కూడా మార్కెట్‌ విలువ ప్రకారం వసూలు చేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు ఎన్నికల కోసం కాదని, చిరు వ్యాపారులను నాశనం, కార్పొరేట్‌ శక్తుల బాగు కోసమేనని అన్నారు. దేశంలో చిరువ్యాపారులు నాలుగు కోట్ల మంది, రోడ్డు పక్కన, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారు 11 కోట్ల మంది ఉన్నారన్నారు. ఇదే సమయంలో డీమార్ట్‌, వాల్‌మార్ట్‌ వంటి షాపింగ్‌మాల్స్‌ వల్ల కేవలం కోటీ 25 వేల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుందని, మిగిలినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. యువత ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు చిన్ని బాబూరావు, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు బి.బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులు నిలబడాలంటే కార్పొరేట్లను అడ్డుకోవాలి
మానేపల్లి సూర్యనారాయణగుప్త, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు

కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారులు తరతరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. నేడు కార్పొరేట్‌ శక్తులు పెద్దపెద్ద మాల్స్‌ పెట్టడంతో చిరు వ్యాపారులు నాశనమవుతున్నారు. దీంతో వ్యాపారాలు చేయాలో, మానాలో తెలియని పరిస్థితుల్లో చిరువ్యాపారులు కొట్టుమిట్లాడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థపై అవగాహన తప్పనిసరి
కె.సత్యాదేవి, ప్రముఖ న్యాయవాది

సమాజ అభివృద్ధిలో యువతే కీలకం. ఆర్థిక వ్యవస్థఫై యువత పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కార్పొరేట్‌ శక్తుల వల్ల రైతులు, సామాన్యులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు యువత చొరవ చూపాలి.