ఆర్థిక వ్యవస్థ క్షీణించిన, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చులో ఈ అసాధారణమైన కుదింపు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాల చెల్లింపులను ఏ లక్ష్యంతో కేంద్రం తిరస్కరిస్తుంది? ద్రవ్యలోటు పెరుగుతుందన్న కేంద్ర ప్రభుత్వ అర్ధంలేని భయాల ఫలితంగానే ఇది జరుగుతుంది. ప్రభుత్వ ఖర్చులో గమనించదగిన పెరుగుదలతో ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక సేవా రంగమైన విద్య, ఆర్థిక రంగాలైన వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ విస్తరణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని ప్రవేశ పెట్టడం ద్వారా
భారీ సత్ఫలితాలు పొందొచ్చు.
వాస్తవానికి రెండు సంఖ్యలు మాత్రమే రానున్న బడ్జెట్ తీరును సూచిస్తాయి. 2020-21లో ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకొని, ఎంత ఖర్చు చేసింది? 2021-22లో ఎంత ఖర్చు చేయాలని అనుకుంటుంది? ఈ రెండు సంఖ్యలే, ఆర్థిక మంత్రి పునరుద్ధరణ చర్యలను సూచించినా గానీ, సమీప భవిష్యత్తులో స్థూల ఆర్థిక వ్యవస్థ స్వస్థత సమకూరే అవకాశాలను నిర్ణయిస్తాయి.
ఇదిలా వుండగా, కోవిడ్-19 పట్ల భారత ప్రభుత్వ ప్రతిస్పందన (ఆర్థిక నిబంధనల ప్రకారం) ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిలో వుంటోంది. ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు, చర్చలు లేకుండానే జాతీయ లాక్‌డౌన్‌ను విధించడమే కాకుండా, ఒకానొక సమయంలో, అవసరం లేకుండానే (కేసుల సంఖ్య, వ్యాధి వ్యాప్తి బాగా తీవ్రం అయ్యే సమయంలో) ''అన్‌లాక్'' ప్రక్రియ చేపట్టి, ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది.
ప్రభుత్వం ఈ ఒక్క చర్యతో లక్షలాది మంది ప్రజలను జీవనోపాధికి దూరం చేసింది. ఆ తరువాత వారికి ఏ విధమైన నష్టపరిహారాన్ని గానీ, సామాజిక భద్రత గానీ సమకూర్చలేదు. 95 శాతం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు వున్న ఒక దేశంలో ఇది నమ్మశక్యం కాని, క్షమించరాని చర్య. వీరిలో సుమారు 50 శాతం మంది స్వయం ఉపాధి కార్మికులు. వారం రోజుల పాటు ఆదాయం నష్ట పోయిన వీరు (అప్పటికే జీవనోపాధికి అంచున వున్నారు) మిలియన్ల సంఖ్యలో ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ సంఖ్యలో ప్రజలలో ఆకలి బాగా పెరిగిన సమయంలో, ప్రభుత్వం ఆహార ధాన్యాల మిగులు సేకరణను కూడా పెంచి, ఎఫ్‌సిఐ వద్ద నిల్వ వుంచింది. అవసరానికి నిల్వ చేసే ఆహార ధాన్యాలు (బఫర్ స్టాక్) రెట్టింపు వున్నాయి. అయినప్పటికీ రేషన్‌కార్డుదారులకు నెలకు ఉచితంగా ఇచ్చే ఐదు కేజీల ఆహార ధాన్యాలను కూడా నవంబర్ 2020 నుండి ఇవ్వకుండా నిలిపివేశారు. రేషన్ విధానానికి అవతల వున్న 100 మిలియన్లకు పైగా యోగ్యత కలిగిన ప్రజలకు (వారి తప్పిదాలు లేకుండానే), ఏ విధమైన నష్టపరిహారాన్ని సమకూర్చలేదు. కోట్లాది మంది ప్రజలకు ప్రాథమిక ఆహార వస్తువులను తిరస్కరించడం ఒక విషాదం. బాలింతలకు, శిశువులకు, చిన్నారులకు పోషకాహార లోపం వల్ల భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.
స్థూల ఆర్థిక నిబంధనలలో, ప్రభుత్వ ఖర్చు లోపించడం వల్ల ఘోరమైన ఫలితాలు సంభవించాయి. 2020, ఏప్రిల్ - నవంబర్ మధ్య కాలంలో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు క్షీణించింది (ఒకసారి ద్రవ్యోల్బణాన్ని లెక్క లోకి తీసుకున్నపుడు). గడిచిన సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కేవలం 4.7 శాతం మాత్రమే పెరిగింది. ఇదే కాలంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా ఉంది. ఇది ప్రతికూల ద్రవ్య విధానానికి చేరుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు తిరస్కరించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఖర్చు చేయనీయకుండా తిరస్కరించింది. ఎవరితో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా, రాష్ట్రాలకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే జాతీయ లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి జాతీయ విపత్తుల నిర్వహణ చట్టాన్ని ఉపయోగించింది. ఆ తర్వాత, తన చర్యల ఫలితంగా ఏర్పడిన పరిణామాలకు....ఆర్థిక పరమైన బాధ్యతలను తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంది. కరోనా మహమ్మారిని అదుపు చేసే చర్యలు సైతం చేపట్టలేదు. అంతేకాకుండా, కేంద్రం ఆరోగ్య సంరక్షణ కోసం అయ్యే అదనపు ఖర్చులను, పెరిగిన ఆర్థిక సంక్షోభ నివారణా నిర్వహణను రాష్ట్రాలకు వదిలేసింది. జూలైలో ప్రకటించిన రెండో ''ఉద్దీపన'' ప్యాకేజీలో, రాష్ట్రాలు తిరిగి చెల్లించే విధంగా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన జిఎస్‌టి నష్టపరిహారాల బకాయిలు కూడా ఇచ్చేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా, తాను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలను మాత్రం అప్పుల ద్వారా చెల్లించి, ఆ అప్పులను తీర్చే ఒక కఠినమైన పద్ధతిని రాష్ట్రాలపై రుద్దింది. ఆ పద్ధతి ప్రకారం కేంద్రం ఆర్‌బిఐ నుండి రుణం తీసుకొని, రాష్ట్రాలకు రుణం ఇస్తుంది. రాష్ట్రాలు తిరిగి వాటిని వడ్డీ లేకుండా చెల్లించాలట. ఈ హాస్యాస్పదమైన, అన్యాయమైన ఏర్పాటు కూడా, ఒక సంవత్సరంలో కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలలో సగం కన్నా తక్కువ మాత్రమే సమకూర్చుతుంది.
ఆర్థిక వ్యవస్థ క్షీణించిన, కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చులో ఈ అసాధారణమైన కుదింపు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాల చెల్లింపులను ఏ లక్ష్యంతో కేంద్రం తిరస్కరిస్తుంది? ద్రవ్యలోటు పెరుగుతుందన్న కేంద్ర ప్రభుత్వ అర్ధంలేని భయాల ఫలితంగానే ఇది జరుగుతుంది.
ప్రజల బాధలు తీవ్రం కావడం, అవి దీర్ఘ కాలం కొనసాగడంతో పాటు ఆర్థిక సంకోచ ధోరణులకు ఇలాంటి ద్రవ్య కుదింపు తోడు అవుతుంది. ఈ ఆర్థిక సంకోచ కార్యకలాపం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు కూడా తగ్గడానికి దారితీస్తుంది. కాబట్టి అంచనాలకు మించిన ద్రవ్యలోటు పెరుగుదల కొనసాగుతుండడం కూడా ఆశ్చర్యం కలిగించదు.
ఇలా వున్నప్పటికీ, మాంద్యం కాలంలో అదనపు ఆదాయాల కోసం ఇంధనం పైన అధిక మొత్తంలో పన్నుల వడ్డింపును కొనసాగించడం కేంద్ర ప్రభుత్వ మరొక ఆశ్చర్యకరమైన చర్య. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత భారీగా పెరగడం చరిత్రలో ఎన్నడూ లేదు. ఈ పెరుగుదల నిరుత్సాహ పరిచే ధోరణికి తోడై మందకొడి ద్రవ్యోల్బణానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తుంది.
ఇలాంటి నేరాల తరువాత క్షమాపణలేంటీ? ఒక స్థిరత్వం లేని, అన్యాయమైన, ప్రతికూల విధానాలను తలకిందులు చేయడమే వీటికి పరిష్కార మార్గం. ప్రభుత్వ ఖర్చులో గమనించదగిన పెరుగుదలతో ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక సేవా రంగాలైన విద్య, ఆర్థిక రంగాలైన వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ విస్తరణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని ప్రవేశ పెట్టడం ద్వారా భారీ సత్ఫలితాలు పొందవచ్చు.
పేలవమైన ప్రణాళికలు, దూకుడుగా అమలు చేసిన లాక్‌డౌన్ ల ఫలితంగా....విచ్ఛిన్నమైన సరఫరా గొలుసుల నుండి ఉద్భవించిన సరఫరా ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు...ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం వుంటుంది.
పెంచబోయే ఖర్చుకు అవసరమైన ఆర్థిక వనరులను, సంపన్న వర్గాలపైన పన్నులను విధించడం ద్వారా, మన దేశం నుండి లాభాలను బయటకు మళ్ళించే బహుళజాతి కంపెనీలను అడ్డుకునేందుకు సంస్కరణల పన్నులను విధించడం ద్వారా సమకూర్చవచ్చు.
కానీ ఇవన్నీ ప్రస్తుతం రెండవ ప్రాధాన్యతను కలిగి వున్నాయి. అతి ముఖ్యమైన అంశం ప్రజలు చేసే ఖర్చును పెంచడం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ సమర్పించినపుడు చూసేది ఆ రెండు సంఖ్యలనే.
('ద వైర్' సౌజన్యంతో)
జయతీ ఘోష్











