- నిధుల్లేక పంచాయతీల్లో అవస్థలు
- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్
- జెడ్‌పి ఆవరణలో అర్ధనగ ప్రదర్శన
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: గ్రామాల అభివృద్ధికి 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన రూ.వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి పథకాలకు, అవసరాలకు దారిమళ్లించి వాడుకుంటోందని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణంనాయుడు, జిల్లా అధ్యక్షులు పిన్నింటి భానోజీరావు ధ్వజమెత్తారు. తక్షణమే ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యాన సోమవారం అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల ప్రజలు, సర్పంచ్‌ల న్యాయబద్ధమైన 15 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమీ చేయలేక, కనీస మౌలిక సదుపాయాలను ప్రజలకు సమకూర్చలేక సర్పంచ్‌లంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజలు ప్రశ్నించే స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారని చెప్పారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సంఘం నిధులనూ ఖాతాల నుంచి చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, గృహసారథులను, సచివాలయ కన్వీనర్లను కొత్తగా ప్రవేశపెట్టి సర్పంచ్‌లకు పోటీగా సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు ప్రస్తుతం గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు జమ చేసి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించకుండా గ్రామ పంచాయతీల సొంత నిధులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలు మండలాల నుంచి సర్పంచ్‌లు పాల్గొన్నారు.










