ప్రజాశక్తి- ఇచ్ఛాపురం: స్థానిక పురపాలక సంఘానికి విడుదలైన మొదటి విడత 15 ఆర్థిక సంఘం నిధులు రూ.1.20 కోట్లు కేటాయింపుపై కౌన్సిలర్లు సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మొదటి విడతగా మంజూరైన నిధులతో టైడ్ గ్రాంట్ రూ.72,58,134 కాగా, అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ.48,38,758 మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో టైడ్ గ్రాంట్ నుంచి పట్టణంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే మంచిదని ఒకటో వార్డు కౌన్సిలర్ ప్రేమకుమార్ సూచించారు. ఈ నిధులు కేవలం నీటి సరఫరా, శానిటేషన్ కోసం వెచించాలని నిబంధన ఉందని కమిషనర్ రమేష్ తెలిపారు. మున్సిపాలిటీలో సమగ్ర నీటి పథకం పనులు ఉండడం వల్ల మార్పు చేసి ఉన్నత అధికారుల ఆమోదం కోసం పంపిస్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. టిడిపి కౌన్సెల్ సభ్యులు ఆసీ లీలారాణి, పత్రి తవిటియ్య మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి వార్డులోనూ సమస్యలు పరిష్కరించేందుకు నిధులు ఖర్చు చేయాలన్నారు. టిడిపి కౌన్సెల్ సభ్యులు కాళ్ల దిలీప్ మాట్లాడుతూ సెంటర్ లైటింగ్ అవసరమైన ప్రతిసారీ ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని అన్నారు. నిధులు కేటాయించిన వెంటనే పనులు చేపట్టాలని అన్నారు. దీంతో వచ్చిన నిధులు ఆన్ని వార్డుల్లో చిన్న చిన్న రోడ్లు, కాలువల నిర్మాణాలకు వినియోగించాలని వార్డు కౌన్సిలర్లు బచ్చు జగన్, చిదిపోతి జగన్, ప్రదీప్‌లు సూచించారు. వైస్ చైరపర్సన్లు భారతీ దివ్య, లాభాల స్వర్ణమణి మాట్లాడుతూ వార్డుల్లో సమస్యలు ఉండగా... సెంటర్ లైటింగ్‌కు ఖర్చు చేస్తే విమర్శలు వస్తాయని, ఈ నిధులు వినియోగంపై పలువురు పలు రకాలు సూచనలు చేశారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కమిషనర్ ఆధ్వర్యాన ఇంజినీరింగ్ అధికారులు పర్యటించి అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలు పరిశీలించి నిధులు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.










