Feb 22,2023 22:10

ప్రజాశక్తి-విజయవాడ: జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని, సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్దిదారులకు త్వరగా రుణాలు మంజూరు చేసి అభివృద్దిలో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు బ్యాంక్‌ అధికారులను కోరారు. స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం వీడియో కాన్ఫెరెన్స్‌ సమావేశం మందిరంలో బుధవారం జెసి అధ్యక్షతన జిల్లా కన్సల్టెటివ్‌ (డిసిసి), జిల్లా స్థాయి రివ్యూ కమిటీ (డిఎల్‌ఆర్‌సి) బ్యాంకర్స్‌ సమావేశం నిర్వహించారు. జెసి మాట్లాడుతూ బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందుకు సంబంధించి అన్ని బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు తక్షణమే రుణాలు అందించాలని కోరారు. ఎపి ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్థన్‌ మట్లాడుతూ చిరు వ్యాపారులకు, వడ్డీ వ్యాపారస్తుల నుండి రక్షణ కల్పించే జగనన్న తోడు పథకానికి, రుణాలు మంజూరు చేయడంలో కొన్ని బ్యాంకులు లబ్దిదారులను ఇబ్బందులు గురి చేస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోనే పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉందని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి కోటేశ్వరరావు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిజనల్‌ హెడ్‌ యువి రజనీకాంతారావు, ఆర్‌బిఐ ఏజియం యంజడ్‌ రెహమాన్‌, నాబార్డ్‌ డిజియం మిళ్లింద్‌ చౌల్సాకర్‌, ఎల్‌డియం పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.