
నెల్లిమర్ల: అందరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకొని ప్రధానమంత్రి సురక్ష భీమాయోజన పథకంలో చేరాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు నెల్లిమర్ల శాఖ మేనేజర్ శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కొండగుంపాం గ్రామంలో ఎపిజివిబి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులకు అనేక రకాల సందేశాలను పంపిస్తున్నారని, వాటికి మనం స్పందించితే మన ఖాతాల నుండి నగదును అపహరిస్తున్నారని తెలిపారు. ఫోన్లు ద్వారా బ్యాంకు మీ వద్ద నుండి ఎటువంటి సమాచారం కోరదని, ప్రతి ఖాతాదారుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పధకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తమ బ్యాంకు పొదుపు ఖాతాలపై ఇతర బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ చెల్లిస్తోందన్నారు. పొదుపు ద్వారా భవిష్యత్ జీవితానికి భరోసా ఏర్పర్చుకోవచ్చునన్నారు. తమ బ్యాంకు మిత్రాలు గ్రామాలలో బ్యాంకింగ్ సేవలను నేరుగా అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అర్థిక అక్షరాస్యత పై నిర్వహించిన మేజిక్ షో ఆకట్టుకుంది. బ్యాంకు మిత్ర నడిపేన శిరీష, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.