Dec 29,2022 00:14

ఆర్‌ఎం కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : పిఎఫ్‌ సమస్యలు పరిష్కరించాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, వైద్య సౌకర్యం కల్పించాలని, మందులు ఇవ్వాలని, మట్టిఖర్చుల నిమిత్తం రూ.25వేలు ఇవ్వాలని, విరమణ బకాయిలు వెంటనే అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎపిఎస్‌ఆర్‌టిసి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన బుధవారం ఆర్‌ఎం కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌ఎంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఉద్యోగుల రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వి.తులసీరామ్‌ మాట్లాడుతూ, 2017 పేస్కేల్‌ ఎరియర్స్‌ చెల్లింపులలో గ్రాట్యూటీ చట్టానికి భిన్నంగా యాజమాన్యం లెక్కలు తయారుచేసి 36 నుంచి 39 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులకు లక్షలాది రూపాయలు కోత విధించిందని తెలిపారు. కోత విధించిన మొత్తాలను గ్రాట్యుటీ చట్టం ప్రకారం తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సంవత్సరాలు గడుస్తున్నా పిఎఫ్‌ సెటిల్మెంట్లు చేయడంలేదన్నారు. అన్ని రోగాలకూ మందులు ఆర్‌టిసి ఆసుపత్రి ద్వారా సమకూర్చాలని కోరారు. 2020, 2021 సంవత్సరాలలో ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యూటీ, పిఎఫ్‌, ఇతర సెటిల్మెంట్లు ఇంతవరకు చేయలేదన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.