
ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులు
ప్రజాశక్తి-కావలి : కార్తీకమాసం సందర్భంగా ఎపిఎస్ ఆర్‌టిసి, కావలి డిపో నుండి ప్రఖ్యాత శివక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఎపిఎస్ ఆర్‌టిసి కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసంలో మహిళలు, అయ్యప్పభక్తులు పలు శివక్షేత్రాలలో పూజలు చేయాలని భావిస్తారని, వారి మనోభావాలకు అనుగుణంగా ఆర్‌టిసి అందుబాటు ఛార్జీలతో, తక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తున్నామని అయన పేర్కొన్నారు. మహిళలు, శివభక్తుల కోరిక మేరకు కార్తీకమాసంలో పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం నాడు ఒకేరోజున పంచారామాల దర్శనం అంటే ఐదు ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించడానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి 10గంటలకు కావలిలో బయల్దేరి సోమవారం అమరావతిలోని అమరా రామం, భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని కొమరారామం దర్శించుకుని మంగళవారం ఉదయం 7గంటలకు కావలి చేరుతుందన్నారు. ప్రతీ నెలా ఏర్పాటు చేస్తున్న అరుణాచలం గిరిప్రదక్షణ బస్సు కావలిలో నవంబర్ 26వ తేదీ ఆదివారం ఉదయం 8గంటలకు బయల్దేరి తిరుపతి, చిత్తూరు మీదుగా వేలూరులోని బంగారు దేవాలయం దర్శనం పిదప రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుతుందని, గిరిప్రదక్షణ - దర్శనం పిదప ఉదయం 7 గంటలకు బయల్దేరి కావలికి సాయంత్రం 4 గంటలకు చేరుతుందని వివరించారు. కార్తీకపౌర్ణమి రద్దీ దృష్ట్యా భక్తులు తమ టికెట్లను ముందే రిజర్వేషన్ చేయించుకోవాలని అవసరమైతే అదనంగా బస్సులు నడుపుతామన్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం కావలి నుండి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు డియం శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) కెవిఆర్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) ఎస్‌కె.ఖాజా మొహిద్దీన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డి.రవిప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.