ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఆర్‌టిసి కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ పూర్తి కావడంతో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం సొంతూళ్లకు, అత్తమామలు, తల్లిదండ్రుల ఇళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చిన ప్రయాణికులతో అర్‌టిసి బస్ కాంప్లెక్స్ కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి కాంప్లెక్స్‌లో పెద్దగా ప్రయాణికుల రద్దీ లేకపోయినా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కాంప్లెక్స్ సందడిగా కనిపించింది. బస్ స్టేషన్ ఎదురుగా నిలిపిన ప్రైవేటు జీపులు, ఆటోలు, ఇతర వాహనాల్లోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీంతో గత నాలుగు రోజులుగా పాడేరు పట్టణంలో ఖాళీగా దర్శనమిచ్చిన రోడ్లపై ప్రస్తుతం జనసంచారం పెరగడంతో పాటు వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ పెరిగింది. గురువారం కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.










