Oct 30,2023 00:55

సింహాచలం డిపో వద్ద నిరసన తెలుపుతున్న ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
సింహాచలం : కావలి వద్ద ఆర్‌టిసి డ్రైవర్‌పై దాడిని ఖండిస్తూ విశాఖ పరిధిలోని సింహాచలం డిపో వద్ద ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యాన ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ కార్యదర్శి ఇవిఎం.రాజు మాట్లాడుతూ సిబ్బందికి యాజమాన్యం రక్షణ కల్పించాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రెసిడెంట్‌ కెజెపి.రావు, యూనియన్‌ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లకు, కండక్టర్లకు భద్రత కల్పించాలని ప్రజా రవాణా శాఖ వైఎస్‌ఆర్‌ ఫెడరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ గేటు ముందు నిరసన చేపట్టారు. కావలి డిపో డ్రైవర్‌, కండక్టర్లపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం అనకాపల్లి జిల్లా వైయస్సార్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యదర్శి వి.దేముడు మాట్లాడుతూ, కావలి ఆర్టీసీ డిపో డ్రైవరు, కండక్టర్‌ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. డిపో కండక్టర్‌, డ్రైవర్‌పై 14 మంది అతి కిరాతకంగా దాడి చేయడం హేయమైన చర్యని ఆయన అన్నారు. ఇటీవల కశింకోట మండలం చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన ఆర్టీసీ సిబ్బందిపై 40 మంది దాడి చేయడం, నర్సీపట్నం డిపోకు చెందిన జిల్లేడు పూడి గ్రామానికి చెందిన రాంబాబు పై దాడి చేయడం జరిగిందని ఇటువంటి ఘటనలు పలుచోట్ల చోటు చేసుకోవడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్‌ సిహెచ్‌ గోవింద, నర్సీపట్నం డిపో ప్రెసిడెంట్‌ కేఎన్‌ రావు, జాయింట్‌ సెక్రటరీ ఎల్‌ వై నాయుడు, తలుపులు తదితరులు పాల్గొన్నారు.