Nov 19,2022 23:03

బస్సు డ్రైవర్‌ చాకచాక్యంతో తప్పిన పెనుప్రమాదం
నలుగురికి తీవ్రగాయాలు, ఇద్దరికి స్వల్పగాయాలు,
రెండు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్‌
ప్రజాశక్తి - ముదినేపల్లి

               ఆర్‌టిసి బస్సు, టిప్పర్‌ ఎదురెదురుగా ఢకొీన్న ఘటన శనివారం ఉదయం పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై ముదినేపల్లి-చినపాలపర్రు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గుడివాడ ఆర్‌టిసి డిపోకు చెందిన ప్యాసింజర్‌ బస్సు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పల్లెపాలెంలో నైట్‌హాల్ట్‌ చేసి శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో అక్కడ నుంచి గుడివాడ బయల్దేరింది. ఈ క్రమంలో ముదినేపల్లి మండలం చినపాలపర్రు సమీపంలోకి బస్సు వచ్చేసరికి గుడివాడ నుంచి బంటుమిల్లి ఇసుక క్వారీకి అతివేగంగా వెళ్తూన్న టిప్పర్‌ ఎదురుగా వచ్చి బస్సును ఢకొీంది. ప్రమాద సమయంలో బస్సులో 58 మంది ప్రయాణికులతోపాటు బస్సు కండక్టర్‌, డ్రైవర్‌తో సహా మొత్తం 60 మంది ఉన్నారు. దీంతో బస్సు, టిప్పర్‌ రోడ్డు మధ్య అడ్డంగా నిలిచిపోయాయి. రెండు వాహనాలు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఒకపక్క రోడ్డు విస్తరణ పనులు, మరోపక్క మురుగుకాల్వ, రోడ్డు సరిగ్గా లేకపోవడం, టిప్పర్‌ అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. బస్సుడ్రైవర్‌ చాకచాక్యంతో వ్యవహరించడంతో పెనుప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ కెఎస్‌.నారాయణ తొడకు తీవ్రగాయమవ్వగా కండక్టర్‌ కెవి.కొండలుకు ముక్కు, తలపై గాయాలవ్వడంతోపాటు పన్ను విరిగింది. చల్లపల్లికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ నరేంద్రకుమార్‌ (25)కు కుడికాలు విరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న బంటుమిల్లి మండలం మల్లపరాజుగూడేనికి చెందిన చింతల రంగారావు (50), ముదినేపల్లి మండలం వడ్డాలికి చెందిన కె.జగన్నాధరావు (58), నక్క శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ షణ్ముఖసాయి తన సిబ్బందితో ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులు టిప్పర్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టపై బయటకు తీశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు వాహనాలను క్రేన్‌ సహాయంతో రోడ్డు మార్జిన్‌లోకి తొలగించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అటంకమూ లేకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌టిసి గుడివాడ డిపో మేనేజర్‌ రాజేష్‌కుమార్‌, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఆర్‌టిసి ట్రాఫిక్‌ సిఐ సత్యనారాయణ, ఎఇఎం ఎంపిజె.రాజు, విజిలెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.రత్నం తదితర అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.