ప్రజాశక్తి - ముసునూరు
తమ గ్రామాల మీదుగా ఆర్‌టిసి బస్సు సర్వీస్ నడపాలని ముసునూరు మండలంలోని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చింతలవల్లిలో ఆర్‌టిసి బస్సును అడ్డగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మండలంలోని చింతలవల్లి గ్రామం మీదుగా లోపూడి వెళ్లే ఆర్‌టిసి బస్సు మళ్లీ తిరిగి వచ్చేటప్పడు కూడా లోపూడి, బస్సావరప్పాడు, చెక్కపల్లి, గోగులంపాడు, చింతలవల్లి మీదుగా నూజివీడు రావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. దీంతో నూజివీడు డిపో మేనేజర్ వచ్చి విద్యార్థులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నూజివీడు నుంచి చింతలపూడి వెళ్లడానికి లోపూడి గ్రామం వైపు యర్రవారిగూడెం మీదుగా 42 కిలోమీటర్లు మాత్రమేనని, అదే విసన్నపేట, చాట్రాయి గ్రామాల మీదగా వెళ్లాలంటే 65 కిలోమిటర్లు పైగా ఉంటుందని, ఆ రూటులో కూడా ఆర్‌టిసి బస్సు నడపాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.










