Jul 21,2023 20:58

ఆర్‌టిసి ఆస్తుల రక్షణకు చర్యలు

పీలేరు : ఆర్‌టిసి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ బోర్డు డైరెక్టర్‌ ఎ.రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్‌టిసి డిపో ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు ఆర్‌టిసి డిపోకు దక్షిణ దిశగా కొత్తగా ప్రహరీ నిర్మాణంతో పాటు, తూర్పు భాగాన ప్రస్తుతం ఉన్న ప్రహరీ ఎత్తు పెంచనున్నట్లు చెప్పారు. తాను బోర్డు డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టాక డిపోకు చెందిన విలువైన స్థలం అన్యాక్రాంతం అవడాన్ని గుర్తించి అలా స్థలం ఆక్రమణలకు గురికాకుండా కాపాడ్డానికి తాను ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను సంప్రదించి, ప్రహరీ నిర్మాణానికి అనుమతులతో పాటు నిధులు కూడా మంజారు చేయించడం జరిగిందన్నారు. కలికిరి బస్టాండ్‌ ప్రహరీ నిర్మాణానికి రూ.14 లక్షలు, మొలకలచెరువు బస్టాండు స్థలం ఆక్రమణలకు గురికాకుండా రక్షణ గోడ నిర్మానానికి రూ.5 లక్షలు నిధులు మంజూరు అయ్యాయన్నారు. అన్నమయ్య జిల్లా ప్రజా రవాణా అధికారి పి.రాము మాట్లాడుతూ జూలై నెల ఇప్పటి వరకు పీలేరు ఆర్టీసీ డిపో రూ.11 లక్షలు లాభాలను గడించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పీలేరు పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకోవడం కోసం 330 మీటర్ల పొడవు ప్రహరీ నిర్మాణానికి రూ.40 లక్షలు నిధులు మంజూరు అయ్యాయన్నారు. నిర్మాణ పనులు ప్రారంభిస్తూ భూమిపూజ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌టిసి నెల్లూరు జోన్‌ మాజీ చైర్మన్‌ జివి.శ్రీనాథ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోతురాజు, పీలేరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ బండ్ల కుమార్‌, కాంట్రాక్టర్‌ తేజ్‌ దీప్‌, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు రాజు, ఎస్‌ఎం వలి, బస్టాండ్‌ మేనేజర్‌ బాబు నాయక్‌, ఇతర ఉద్యోగులు హాజరయ్యారు.