సింహాద్రిపురం : నియోజవర్గంలో సాగుచేస్తున్న అరటికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజవర్గంలోని పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, వేముల మండలాలలో అరటిని 11,500 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం హెక్టారుకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, రెండవ సంవత్సరం రూ.10 వేలు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేది. ఈ ప్రోత్సాహం అరటి మొక్కల విస్తరణ పథకం కింద అర్హత కలిగిన రైతులకు హెక్టార్ వరకు రాయితీని ప్రభుత్వం ఇచ్చేది. మూడేళ్లుగా ఈ పథకానికి ప్రభుత్వం తూట్లు పడడంతో అరటి సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతుతో అరటి మొక్కలను కొనుగోలు చేసి సాగు చేసేవారు. రెండు సంవత్సరాల నుంచి పులివెందుల ప్రాంతంలో పండించే అరటికాయలకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది రూ.25 నుంచి రూ.30 వేల వరకు ధరలు పలికాయి. రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు
ప్రోత్సాహం ఇవ్వాలి
గత ప్రభుత్వాలు మాదిరిగానే ప్రస్తుత ప్రభు త్వం కూడా అరటి సాగు చేసే ప్రతి రైతును ప్రోత్సహిం చాలి. ప్రోత్సాహం కల్పించడం వలన రైతులు మరింత విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గి కొంతమేర ఉపయో గకరంగా ఉంటుంది.
- మహేశ్వర్‌రెడ్డి, అరటి రైతు, తెలికి.
పథకాన్ని పునరుద్ధరించాలి
అరటి సాగు చేసే రైతులకు గతంలో ఇస్తున్న రాయితీని ప్రస్తుతం కొనసాగించాలి. రైతులకు కొంతమేర ఉపయో గకరంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి పునరుద్ధరణ చేయాలి.
- బాలరామిరెడ్డి, అరటి రైతు, గురజాల.
పథకాన్ని నిలిపివేశారు
గతంలో మొక్కల విస్సన్న పథకం కింద అరటి సాగు చేసే ప్రోత్సాహం లభించేది. మూడు సంవత్సరాల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయడం జరిగింది. ఈ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్న విషయం వాస్తవమే.
- మల్లేశ్వరరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, ముద్దనూరు.










