Nov 09,2023 00:32

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిలా అధ్యక్షులు డి.లకీëనారాయణ

ప్రజాశక్తి-గుంటూరు : ఆర్టీసీలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న గ్రౌండ్‌ బుకింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు బస్టాండ్‌ ఆవరణలో ప్రదర్శన నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయడంలో ఆర్టీసీ పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు, వీక్లీ ఆఫ్‌ లేకపోవటం, కనీస గుర్తింపు కార్డు లేకపోవడం వంటివి అత్యంత దారుణమన్నారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ బి.ముత్యాలరావు మాట్లాడుతూ పిఎఫ్‌, ఇఎస్‌ఐలు అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను యాజమాన్యం చిన్నచూపు చూస్తోందన్నారు. గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల అదే బస్సులో టిక్కెట్‌ కొనుక్కొని ప్రయాణించాల్సి వస్తుందన్నారు. 2019 వరకు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులుగా ఉన్న వారిని ఆర్టీసీ పీస్‌ రేటు కార్మికులుగా టెండరు చేర్చటం కార్మికుల హక్కులన్నీ హరించడమేనన్నారు. రీటెండర్‌ చేసి పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించడంతోపాటు గుర్తింపు కార్డు వంటివి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు నాయకులు శ్రీనివాసరావు, ఆర్టీసీ వర్కర్స్‌ పాల్గొన్నారు.