
ప్రజాశక్తి-గుంటూరు : హార్న్ కొట్టారనే నెపంతో వెంబడించి కావలి ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిఐటియు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారమూ నిరసనలు కొనసాగించారు. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని పాతగుంటూరు సిఐటియు జిల్లా కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు మాట్లాడుతూ ఆర్టీసి డ్రైవర్‌పై జరిగిన దాడిలో నిందితుల్ని శిక్షించే విషయంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్య బాధ్యతగా వ్యవహరించాలని, ఉద్యోగులకు మనోధైర్యం కల్పించాలని కోరారు. 14 మంది దాడిలో పాల్గొంటే కేవలం ఆరుగురినే అరెస్టు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందరికీ కఠినమైన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులపై రకరకాల ఆంక్షల పేరుతో ఉన్న నిబంధన కారణంగానే సమయానికి చేరుకోవాలని ఆత్రుతతో అడ్డన్న వారిని తప్పుకోవాలని హార్న్ మోగించారే తప్ప దీనిలో డ్రైవర్ తప్పేమీ లేదన్నారు. అధికార పార్టీ కౌన్సిలగా ఉన్న వ్యక్తి దాడిలో భాగస్వామిగా ఉన్నాడని, ఎంతటి వారికైనా శిక్షలు పడటం ద్వారానే ఉద్యోగులకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. నిరసనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, కార్యదర్శులు ఎన్.శివాజీ, రమేష్‌బాబు, ఎవిఎన్ కుమారి, రాధా, శ్రీనివాసరావు, ఆది నికల్సన్, రాంబాబు, ఎస్.ఎం.వలి, ఎం.రవి, వేణు, అనురాధ, బోషమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌లో గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇ.విజయ కుమార్, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.రాజేష్ ఖన్నా మాట్లాడారు. దాడికి కారకులైన యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించేంత వరకూ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. నిరసనలో కె.బాబు, ఎన్.సుధాకరరావు, పి.వీరయ్యబాబు, ఎస్.రవీంద్రారెడ్డి, వి.జోషిబాబు, డిడి శ్రీనివా సులు, జి.పోలేరమ్మ, ప్రసన్నజ్యోతి శివపార్వతి, రమాజయశ్రీ, భూలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుమేరకుకు డిపో ఉద్యోగులు ఉదయం 5 గంటల నుండి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరయ్యారు. అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా, డిపో సెక్రటరీ డిపో నాయకులు మాట్లాడారు. బస్టాండ్, బస్సుల్లోని ఉద్యోగులపై దాడి చేస్తే ఐపిసి సెక్షన్ 186, 189, 353 ప్రకారం శిక్ష పడుతుందని బోర్డుల ద్వారా తెలపాలని, ఉద్యోగులకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. నిరసనలో కె.హరిబాబు, కె.రమేష్‌బాబు, టిఎస్ రావు, ఎం.బాబురావు, పి.సాంబశివరావు, జి.శ్రీనివాసరావు, టి.రవిబాబు, మధుబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : స్థానిక బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు భాస్కర్, సాహెబ్, జవహర్, ఎన్‌ఎంయు నాయకులు నాగేశ్వరరావు, సుధాకర్, రమణారెడ్డి, యలమంద పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న సిబ్బందిపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలని, ఉద్యోగులు, సిబ్బందితో ప్రజలు సోదర భావంతో మెలగా లని కోరారు. సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు, సంపత్ వెంకటకృష్ణ, బి.నాగేశ్వ రరావు, జి.కోటేశ్వరరావు, ఎం.కాటంరాజు, ఎఐటియుసి నాయకులు జె.కృష్ణ నాయక్, సుజాత, కొక్కెర వెంకటేశ్వర్లు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి.శ్రీనివాసరావు, బ్రహ్మారావు, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.