Oct 29,2023 21:46

ధర్మవరంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : కావలిలో ఆర్టీసీబస్సు డ్రైవర్‌పై దాడిచేసిన తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ సత్యసాయి జిల్లా అధ్యక్షులు కేబీ నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి నిరసనగా ఆదివారం ధర్మవరం ఆర్టీసీ డిపో ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఈయూ రీజనల్‌ నాయకులు నరసింహులు, బిల్లే ఆదినారాయణ, డిపోకార్యదర్శి ముస్తాఫా, బాబు, సూరీడు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్‌ఎంయూ జోనల్‌ నాయకులు ప్రేమకుమార్‌, సత్యసాయిజిల్లా చైర్మన్‌ ముత్యాలప్ప, డిపో అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌, మధు గ్యారేజ్‌ అధ్యక్ష, కార్యదర్శులు హరి, కుమార్‌ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు..
కదిరి టౌన్‌ :నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి హేయమైన చర్య అని కదిరి ప్రైవేట్‌ బస్సుల యూనియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌. నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్‌పై దాడులు జరుగుతుంటే సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రవేటు బస్సుల యూనియన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవర్‌కు మద్దతుగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
హిందూపురం : ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్‌టిసి కార్మికులు డిమాండ్‌ చేశారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి నిరసనగా యూనియన్లకు అతీతంగా కార్మికులు, ఉద్యోగులు ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి గ్యారేజ్‌ నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, నారాయణ స్వామి, ఎన్‌ఎంయు గౌరవ అధ్యక్షులు శివశంకర్‌, నాయకులు రాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ యూనియన్‌ బాబాజాన్‌, రవి మాట్లాడుతు ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి యూనియన్ల నాయకులు మల్లికార్జున, జిలాన్‌, ప్రతాప్‌, రూపేంద్ర, వేంకటేష్‌, బాషా, సంజీవప్ప, విజయలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ :కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఖండించారు.కదిరి డిపో గ్యారేజ్‌ గేటు వద్ద ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిపో కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నబి రసూల్‌, జిల్లా కార్యదర్శి జివైపి. రావు, రీజినల్‌ సివిపి ఆర్‌ఎస్‌ రెడ్డి, డిపో కార్యదర్శి శంకర్‌, గ్యారేజ్‌ కార్యదర్శి రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ :నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వైసిపి సైకోలను కఠినంగా శిక్షించాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం సవితమ్మ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ తీయమని హారన్‌ కొట్టడం, అడగటం డ్రైవర్‌ చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులపై దాడి చేయడం అంటే వ్యవస్థ మీద దాడి చేయడమే అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర డిజిపి, పోలీస్‌ వ్యవస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయా ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వెంకటరమణ, డివి ఆంజనేయులు, శ్రీరాములు, సూర్యనారాయణ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌, త్రివేంద్రనాయుడు, బాలాజీ నాయక్‌, మూర్తి పాల్గొన్నారు.
గోరంట్ల రూరల్‌ : నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ను కొందరు రౌడీలు అమానుషంగా కొట్టడాన్ని ఎఐటియుసి తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. రాష్ట్రంలో రౌడీల పాలన కొనసాగు తోందని, ఎపిని మరో బీహార్‌లాగా మారుస్తున్నారని ఆరోపించారు. అలాగే గోరంట్లలో ఇటీవల కాలంలో రౌడీలు పేట్రేగిపోతున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడులకు తెగపడుతున్నారని, పాత్రికేయుడిపై దాడి జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇలాంటి రౌడీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మహేష్‌, నాయకులు సుధాకర్‌, సురేష్‌బాబు, వెంకటేష్‌, బాబు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.