Aug 23,2023 00:10

ధర్నా చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు కార్మికులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి ఆర్టీసీ డిపో యాజమాన్యం అద్దె బస్సు కార్మికులపై చేస్తున్న వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం డిపో ఎదుట అద్దె బస్సు కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌ శంకర్రావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి సర్క్యులర్‌కు విరుద్ధంగా కార్మికులపై చర్యలు తీసుకుంటుందన్నారు. 1/2019 సర్క్యులర్లో ఆర్టీసీ డ్రైవర్లకు అద్దె బస్సు డ్రైవర్లకు ఒకే విధమైన పనిష్మెంట్లు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని రాష్ట్రంలో అన్ని డిపాలలో అమలు చేస్తున్నా, అనకాపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డ్యూటీకి వచ్చే ముందు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో వచ్చే పాయింట్‌ ఆధారంగా కార్మికుడిని ఒకరోజు డ్యూటీ ఆపాలని, పదేపదే వచ్చేటప్పుడు విధుల నుంచి తొలగించాలని, అటువంటిది యాజమాన్యం వెంటనే విధుల నుంచి ఆపేస్తుందని మండిపడ్డారు. బస్సు ఆపలేదని పాసింజర్‌ ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచారణ లేకుండా డ్యూటీలు నిలుపుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు ఆదాయాన్ని తీసుకొస్తున్న అద్దె బస్సు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. మరోవైపు కార్మికుల మధ్య కులం పేరుతో విభజన తీసుకొస్తున్నారని ఇది సరైనది కాదన్నారు. సమస్య పరిష్కారం చేయకపోతే జరగబోయే సమ్మెకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైర్‌ బస్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పలక సత్యనారాయణ, సంఘం అధ్యక్షులు నాగ అప్పారావు, నాయుడు, వర్మ, శంకరరావు, కార్మికులు పాల్గొన్నారు.