Jun 18,2023 21:43

ఎండల ధాటికి వాలిపోతున్న అరటి తోటలు
తోటల్లోనే మగ్గిపోతున్న గెలలు
పెట్టుబడి ఖర్చులు కూడా రావని ఆవేదన
ప్రజాశక్తి - ముసునూరు

              మండలంలో ఎండలు 47 డిగ్రీల వరకు ఉండడంతో అరటి తోటలు మలమల మడిపోతున్నాయి. దీంతో అరటి గెలలు సైజు పెరగకపోవడంతో పాటు అరటికాయ నాణ్యత తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల ద్వారా పంపే గెలలు నాణ్యత లేకపోవడంతో సరైన ధర లేక రైతులు కుదేలవుతున్నారు. అదీకాకుండా గత రెండు వారాల క్రితం గాలిదుమ్ము వచ్చి తోటలు పడిపోగా, సగం తోటే పంట దిగుబడి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ నెలలో అరటి గెల రూ.260 ఉండగా, ప్రస్తుతం రూ.200 కూడా లేని పరిస్థితి. మండలంలోని 16 గ్రామాలతో పోల్చుకుంటే మండల కేంద్రమైన ముసునూరు, అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి, గుడిపాడు, సూరేపల్లి గ్రామాల్లో అరటి తోలటకు పెట్టింది పేరు. అరటి రకాల్లో కర్పూరం, చక్రకేళి, బుసాళి, బొంత వంటి రకాల తోటలను సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన అరటి ఎక్కువగా పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, నేపాల్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొందరు చిరువ్యాపారులు తోపుడు బండ్లపై, మోటార్‌ బైకులపై కూడా రైతులు, చిన్నపాటి వ్యాపారులు అమ్మకాలు సాగించేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు.
కౌలు ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు
కౌలు రైతు బడ్డికొట్టు వెంకటేశ్వరరావు

సంవత్సరం నుంచి ఇప్పటివరకు దుక్కులకు, అరటి మొక్కల కొనుగోలుకు, జీవ రసాయిన ఎరువులకు, క్రిమి సంహారక మందులకు, రసాయనిక ఎరువులకు, నీళు ్లపెట్టడానికి కూలీల ఖర్చు ఇలా సాగుకు రూ.3 లక్షలు అయింది. నేను కౌలు చేస్తున్న 1.60 ఎకరాల భూమి నుంచి కనీసం ఒక గెల విక్రయించడంలేదు. ఎండల ధాటికి అరటి తోటలు వాలిపోతున్నాయి. గెలలు మగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో అరటి సాగు చేశాం. ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా ఆశలు అడియాశలు అయ్యాయి. కనీసం కౌలు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
సగం దిగుబడి కూడా రాదు
రైతు రేగుల గోపాలకృష్ణ

నేను కొన్ని సంవత్సరాల నుంచి అరటి తోటలు సాగు చేస్తున్నాను. కాని ఈ సవత్సరం అరటి రైతులకు మరీ గడ్డు పరిస్థితి వచ్చింది. దుక్కులు సాగు చేసే సమయంలో వర్షాలు రావడంతో ఎక్కువ సార్లు దుక్కులు దున్నాల్సిన పరిస్థితి నెలకొంది. మొక్కల కొనుగోలుకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. జీవ రసాయని ఎరువులు, క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరు వుల ధరలు బాగా పెరిగిపోయాయి. పంట ధర మాత్రం పెరగకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకులంగా లేకపోవడం, అరటి తోటలు సగానికి సగం పడిపోవడంతో సగం దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.