Aug 18,2023 21:48

బ్యాంకు అధికారులకు అందజేస్తున్న బంగారు నగలు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి యాత్రికుల నుంచి కానుకల రూపంలో వచ్చిన బంగారం, బంగారు వస్తువులకు ఎస్‌బిఐ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను వర్తింపజేశారు. ఆలయంలో ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ ఎం.వి సురేష్‌బాబు, దేవాదాయశాఖ బంగారు ఆభరణాల తనిఖీ అధికారి అల్లు వెంకట దుర్గాభవానీ, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యుల సమక్షంలో బంగారు వస్తువులను శుక్రవారం తూకం వేశారు. 7.215 కేజీల వస్తువులను గోల్డ్‌ కడ్డీలుగా మార్చేందుకు సిద్ధం చేసి ఎస్‌బిఐ విశాఖపట్నం ప్రతినిధులకు అందజేశారు. స్వామి వారి నిత్యాలంకరణలో వినియోగించే బంగారు ఆభరణాలు బ్యాంకులో భద్రపరుస్తున్నామని, చిన్న బంగారు వస్తువులను మాత్రమే గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌లో పొందుపరిచామని ఆలయ అధికారులు వివరించారు. త్వరలో వెండి వస్తువులకూ ఈ స్కీమ్‌ను వర్తింపజేసేందుకు బ్యాంకు అధికారులు అనుమతించారని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారి చంద్రశేఖర్‌, ఆలయ పాలకమండలి సభ్యులు కొంచాడ సోమేశ్వరరావు, మండవిల్లి రవి, ఎస్‌బిఐ విశాఖపట్నం డిప్యూటీ మేనేజర్‌ డి.కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ బి.సుధీర్‌ కుమార్‌, ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.