Nov 11,2023 22:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన రహదారిపై శనివారం ఉదయం 9 గంటలకు రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత వంతెనపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్‌ కం రైల్‌ వంతెన రహదారి మార్గంలో నిర్దేశించిన విధంగా వాహనాలను మాత్రమే అనుమతిం చడం జరుగుతుందని తెలిపారు. జరిగిన మరమ్మత్తు పనుల వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వంతెన రహదారి నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్లు వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లైట్‌ వెయిట్‌ వాహనాలు, మోటార్‌ సైకిళ్ళు, కార్లతోపాటు, లగేజీ గ్యారేజ్‌ లేని ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు, ఆర్‌టిసి పల్లె వెలుగు బస్సులను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఆ మేరకు ఆయా సంస్థలకు, డిపో మేనేజర్‌లకు ముందస్తు సమాచారం అందచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రహదారి మరమ్మతుల నేపథ్యంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట ఆర్‌ అండ్‌ బి డిఇ బివివి.మధుసుధన్‌, తదితరులు పాల్గొన్నారు.