
ప్రజాశక్తి -అనకాపల్లి
మండలంలోని మామిడిపాలెం గ్రామంలో విఎంఆర్‌డిఏ ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన రైతులకు రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చేవరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్ట రాదని బాధితు రైతులు స్పష్టం చేశారు. గురువారం ల్యాండ్ పూలింగ్ జరిగిన చోట బోరు ఏర్పాటుకు అధికారులు వస్తే వారిని బాధిత రైతులు అడ్డుకున్నారు. బోరు తవ్వకం పనులను అడ్డగించి నినాదాలు చేశారు. నాలుగేళ్ల కిందట భూ సమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వలేదని, తమకు న్యాయం జరిగేంత వరకు పనులు జరగనివ్వ బోమని ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దళిత గిరిజన రైతు కూలి ప్రజలు అడ్డగించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, సభ్యులు వి నరసింగ రావు, బత్తిన కృష్ణ, కే కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.