Aug 25,2022 23:16

ఆందోళన చేపడుతున్న నాయకులు


ప్రజాశక్తి - ఆరిలోవ, కలెక్టరేట్‌
సిపిఎం అక్కయ్యపాలెం జోన్‌ కన్వీనర్‌, కెవిపిఎస్‌ విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్‌పి.రాజు గురువారం హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురవగా కెజిహెచ్‌కు తరలించారు. గురువారం ఉదయం అంతా బాగానే ఉందని ఇంటికి పంపించేశారు. తిరిగి 10.30 గంటలకు రాజు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కెజిహెచ్‌కు మళ్లీ తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని ఆరిలోవ కాలనీ భగత్‌సింగ్‌ నగర్‌కు కుటుంబీకులు, నాయకులు తీసుకొచ్చారు.
పలువురు నివాళి
ఆర్‌పి.రాజు హఠాన్మరణం వార్త తెలిసిన వెంటనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ పూర్వ మేనేజర్‌ ఎస్‌.సుధాకర్‌, ఐద్వా నాయకులు బి.ప్రభావతి, సత్యవతి, బి.పద్మ, రంగమ్మ, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి యుఎస్‌ఎన్‌.రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణ, ఎం.చంటి, సిఐటియు జిల్లా కార్యదర్శులు నరేంద్ర కుమార్‌, అప్పలరాజు, జగన్‌, వెంకటరావు, పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి భౌతికకాయం వద్ద నివాళ్లర్పించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఫోన్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలుండి బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి ఆర్‌పి.రాజు అని పేర్కొంటూ జోహర్లు అర్పించారు. ఆయన మృతి ప్రజా ఉద్యమానికి, బడుగు, బలహీన వర్గాలకు, పార్టీకి, కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. రాజు మృతికి సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది.
కుటుంబ నేపథ్యం
ఆర్‌పి.రాజు స్వస్థలం ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం, గలావల్లి గ్రామం. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య ధనలక్ష్మి, ఒక కుమార్తె, కుమారులు నవీన్‌, జీవన్‌ (కవలలు) ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. కుమారులు స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు.
విద్యాభ్యాసం
రాజు పదో తరగతి వరకు సంతకవిటి మండలం, గొల్ల సీతారామపురంలో విద్యనభ్యసించారు. రాజాం జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉన్నప్పుడు విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన కంచరపాలెం ప్రభుత్వ కాలేజీలో ఐటిఐ పూర్తి చేశారు.
ఉద్యమ నేపథ్యం
1996లో ఆరిలోవ భగత్‌ సింగ్‌నగర్‌లో ఉంటున్న కాలంలో డివైఎఫ్‌ఐలో చేరి నాయకునిగా అక్కడ సంఘం ఏర్పాటు చేశారు. అనంతరం సిపిఎంలో చేరారు. 1997 నుంచి పూర్తి కాలం కార్యకర్తగా ఉన్నారు. 2000లో అక్కయ్యపాలెం జోన్‌ బాధ్యులుగా పని చేశారు. కెవిపిఎస్‌ విశాఖ జిల్లా కార్యదర్శిగా, కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యునిగా, విశాఖ దళిత సంఘాల జెఎసి సభ్యునిగా ప్రస్తుతమున్నారు. 2017 నుంచి సిపిఎం అక్కయ్యపాలెం జోన్‌ కన్వీనర్‌గా ఉన్నారు.
ప్రధాన ఉద్యమాలు
1996లో మధురవాడలో పెప్సీ కంపెనీ తెరిపించాలని, 250 మందికి ఉపాధి కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రభుత్వ నిర్భంధంలో 13 రోజులు జైల్లో ఉన్నారు. 2000లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇల్లు లేని పేదల కోసం 2006లో జరిగిన భూపోరాటంలో అరెస్టయి 15 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.1996లో కొంతమంది అవినీతిపరులు పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించగా, దానిని అడ్డుకొని ఆరిలోవ భగత్‌సింగ్‌ నగర్‌లో పార్టీకి అండగా ఉన్నారు. అక్కడ పార్టీని విచ్ఛిన్నం కాకుండా చూశారు.
నేడు ఎఎంసికి రాజు దేహం అప్పగింత
ఆర్‌పి.రాజు సంతాప సభ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆరిలోవ కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌లో జరుగనుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆంధ్ర మెడికల్‌ కాలేజీకి రాజు పార్థివదేహాన్ని అప్పగిస్తామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.